ASIFABAD
కైరిగూడ ఓసీపీ: సింగరేణి కార్మికులకు న్యాయమైన లాభాల వాటా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని HMS యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ హైమద్ విమర్శించారు. బుధవారం కైరిగూడ ఓసీపీలో HMS యూనియన్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ హైమద్, అధ్యక్షుడు తిప్పారపు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రియాజ్ హైమద్ మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది పర్మినెంట్ కార్మికులు, 35 వేల మంది కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి, కుటుంబాలను సైతం పక్కనపెట్టి కష్టపడటం వల్లే సింగరేణి సంస్థకు లాభాలు వస్తున్నాయని అన్నారు. అలాంటి కార్మికులకు న్యాయమైన లాభాల వాటా ఇవ్వకుండా అన్యాయం చేయడం దారుణమని మండిపడ్డారు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉండగా, వాస్తవ లాభాలను తగ్గించి చూపడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. AITUC, INTUC వంటి కార్మిక సంఘాల సహకారంతోనే ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ పరిణామాల వల్ల ఒక్కో కార్మికుడు లక్ష రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు కార్మికులకు సమాధానం చెప్పాలని రియాజ్ హైమద్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే కోల్బెల్ట్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కార్మికుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లాభాలను ప్రకటించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను పారదర్శకంగా ప్రకటించి కార్మికులకు న్యాయమైన వాటాను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం HMS యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఎం. శివారెడ్డి, కైరిగూడ పిట్ సెక్రటరీ శ్రవణ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎస్. కుమార్ గౌడ్, కేంద్ర ఉపాధ్యక్షుడు ఎం.డి. ఓజియర్, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ సిద్ధంశెట్టి సజన్, కైరిగూడ ప్రాజెక్ట్ ఇన్చార్జి డి. వెంకటేష్, ఏరియా ఆర్గనైజర్లు ఎస్.కె. ఇనూస్, ఎంబడి ప్రశాంత్, కిష్టస్వామి, మహేష్, మనల సంజీవ్, కార్యకర్తలు ఎ. రాజశేఖర్, జి. భలేష్ తదితరులు పాల్గొన్నారు.