సీతాఫలంపైనా ఎల్‌నినో ప్రభావం – పండును కొనేందుకు జంకుతున్న వినియోగదారులు
సీతాఫలం పంటపై ఎల్‌నినో ప్రభావం పడింది. సకాలంలో వర్షాలు లేక దిగుబడి భారీగా తగ్గాయి. దీంతో మార్కెట్‌కు సరుకు తగ్గడంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం డజను రూ.400 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు. రుచికి రుచి. పోషకాలకు పోషకాలు. సహజ కార్బోహైడ్రేట్లతో శరీరానికి శక్తినిచ్చే సీతాఫలంపై ఎల్‌నినో ప్రభావం పడింది. సకాలంలో వర్షాలు లేక పంట దిగుబడి భారీగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. పోషకాల ఖజానాగా పేరున్న ఈ పండును కొనేందుకు వినియోగదారులు వెనకాడే పరిస్థితి తలెత్తింది. అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీతాఫలం దిగుబడి ఎందుకు తగ్గింది? రైతుల నుంచి వ్యాపారి, సామాన్యుడి వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న “ధరల మోత” వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు రైతులకు మంచి ఆదాయాన్ని అందించిన సీతాఫలం సాగు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. పూత, పిందె దశల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం ఈ ఫలం దిగుబడికి కీలకం. అయితే ఈసారి సకాలంలో వర్షాలు లేక ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దీనివల్ల పూత దశలోనే పంటపై ప్రభావం పడగా పిందెలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా తోటల నుంచి మార్కెట్‌కు వచ్చే సరుకు గణనీయంగా తగ్గిపోయింది. దిగుబడి తగ్గినా, సాగు ఖర్చులు మాత్రం తగ్గలేదు. కూలీల ఖర్చు, తోటల సంరక్షణ, నీటి వసతి, ఎరువులు, ఇతర పెట్టుబడుల్లో మార్పులేదు. ధర పెరగడం కొంత ఊరటనిస్తున్నా, దిగుబడి తగ్గడంతో ఆ ప్రయోజనం పూర్తిగా తమకు దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనేందుకు జంకుతున్న వినియోగదారులు: మార్కెట్‌లో సీతాఫలం లభ్యత తగ్గి, ధరలు భారీగా పెరిగాయి. తోటల నుంచి తక్కువగా వచ్చే సరుకు కోసం వ్యాపారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. విక్రయించడం కష్టంగా మారుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ఎక్కువగా కొనుగోలు చేసే వినియోగదారులు ఈసారి ధరలను చూసి భయపడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. “ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడక్కడా తోటలు పడిపోయాయి. వేసవికాలం దాటిన తర్వాత పిందులు వస్తాయి. నెలకు రెండు, మూడు వర్షాలు పడితే సీతాఫలం ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సీతాఫలం పండ్లు ఎండిపోయాయి. సీతాఫలం సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ఆదాయం కూడా అంతంత మాత్రంగా లేదు”- రైతులు గతంలో కంటే అధిక ధరలు: ఏటా ఈ సీజన్‌లో సీతాఫలానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో డజను సీతాఫలాలు రూ.150 నుంచి రూ.200 వరకు లభించగా, ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరల వల్ల పరిమితంగానే కొనాల్సి వస్తోందని సీతాఫల ప్రియులు అంటున్నారు. వాతావరణ మార్పులతో ప్రకృతి చూపిన ప్రతాపం. అన్నదాత నుంచి సామాన్యుడి వరకు అందరిపైనా ఆర్థిక భారాన్ని మోపుతోంది. పెట్టుబడులు పెరిగి, దిగుబడి పడిపోయి రైతు అల్లాడిపోతుంటే, ఆకాశాన్ని తాకుతున్న ధరలతో వినియోగదారుడు తనకు ఇష్టమైన పండును కొనలేని పరిస్థితి తలెత్తింది.





