నర్సాపూర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
నర్సాపూర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నర్సాపూర్, జులై 17, పున్నమి ప్రతినిధి: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కేంద్రంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల బాగోగులే తమ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉండి, ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతుందనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుడు 600 స్క్వేర్ ఫీట్స్ లోపు ఇంటిని నిర్మించుకోవాలనీ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మహిళల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ, ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలు ఆర్థికంగా ముందుకు వస్తున్నారని, స్వయం శక్తితో, స్వయం ఉపాధిలో మహిళలు రాణిస్తూ చిన్నతరహా వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కుటుంబాలను ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.