వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్
చెరువులు, కాలువలపై ముఖాముఖి చర్చకు సిద్ధమని వెల్లడి బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): బలభద్రపురం గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి స్పందించారు. సంత మార్కెట్ వద్ద ఉన్న ఊరచెరువును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపవరం వెదుళ్ల చెరువు నుంచి మిగులు నీరు కలింగల ద్వారా ఊరచెరువులోకి చేరి, అక్కడి తూము, సుమారు 12 అడుగుల బోధి ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్లే సహజ నీటి ప్రవాహ వ్యవస్థ గతంలో ఉండేదని తెలిపారు. వాకింగ్ ట్రాక్ పేరుతో చెరువు చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలకు తగిన తూములు ఏర్పాటు చేయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని ఆరోపించారు. 2013 నీలం తుఫాను సమయంలో బలభద్రపురం గ్రామంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో కాలువ పనులు చేపట్టి నీటిని గోదావరి కాలువలోకి మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. గీతా మందిరం వెనుక ఉన్న 12 అడుగుల బోధి, కాలువలు, పుంతల పరిస్థితిపై రికార్డులతో సహా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వీరరాఘవరెడ్డితో పాటు వైసీపీ నాయకులు ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ చేశారు. మత్స్యకార కుటుంబాలు నిర్మించిన బండకు సంబంధించి తాము ఎలాంటి బిల్లులు తీసుకోలేదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి.. తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాల పరిమితిని మించి నిర్మాణాలు చేపట్టలేదని వైసీపీ నాయకులు నిరూపించాలని కోరారు. చెరువులు, కాలువలపై రాజకీయ ఆరోపణలకు బదులుగా రికార్డుల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన అన్నారు.