संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: ఆసిఫాబాద్

ASIFABAD

సమాచారం ప్రజల హక్కు – దాచడం నేరం! RTI చట్టానికి 21 ఏళ్లు.

ఆసిఫాబాద్ న్యూస్ సమాచారం ప్రజాస్వామ్య చరిత్రలో అక్టోబర్ 12, 2005 ఒక చారిత్రాత్మక రోజు. ఆ రోజే సామాన్యుడి చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అదే సమాచార హక్కు చట్టం – 2005 (Right to Information Act, 2005). నేటికి ఈ చట్టం అమలులోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 21 ఏళ్ల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, సాధించింది ఎంతో, సాధించాల్సింది ఇంకెంతో అర్థమవుతుంది. *RTI పుట్టుక వెనుక పోరాటం:* ఈ చట్టం ఊరికే రాలేదు. రాజస్థాన్ లోని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) చేసిన సుదీర్ఘ పోరాటం, అరుణా రాయ్ లాంటి సామాజిక కార్యకర్తల త్యాగం ఫలితంగా ఈ చట్టం వచ్చింది. “మన డబ్బు – మన లెక్క” అనే నినాదంతో మొదలైన ఈ ఉద్యమం, చివరికి పార్లమెంట్ ను కదిలించింది. *చట్టం చెప్పేది ఏమిటి?* చాలా సింపుల్. ఈ దేశ పౌరుడైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అడిగే హక్కు ఉంది. పార్లమెంట్ నుండి పంచాయతీ వరకు, ప్రధానమంత్రి కార్యాలయం నుండి గ్రామ కార్యదర్శి వరకు ఎవరైనా జవాబు చెప్పాల్సిందే. కేవలం 10 రూపాయల ఫీజుతో దరఖాస్తు పెడితే, 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. ఇవ్వకపోతే, తప్పుడు సమాచారం ఇస్తే సంబంధిత అధికారికి రోజుకు రూ.250 చొప్పున రూ.25,000 వరకు జరిమానా విధించే అధికారం సమాచార కమిషన్ కు ఉంది (సెక్షన్ 20). *కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి:* మన జిల్లా అటవీ, గిరిజన ప్రాంతం. ఇక్కడే ఈ చట్టం ఎక్కువ అవసరం. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. *1. సెక్షన్ 4(1)(b) – కాగితాలకే పరిమితం:* చట్టం ప్రకారం ప్రతి కార్యాలయం 17 అంశాల సమాచారాన్ని స్వచ్ఛందంగా బోర్డు మీద పెట్టాలి. బడ్జెట్ ఎంత? పనులకు ఎంత ఖర్చు చేశారు? ఉపాధి హామీలో ఎన్ని రోజులు పని ఇచ్చారు? కానీ జిల్లాలోని 90% పంచాయతీల్లో ఈ బోర్డులు లేవు. కాగజ్ నగర్, సిర్పూర్, ఆసిఫాబాద్ మండలాల్లోని చాలా పంచాయతీల్లో 2023 తర్వాత ఆడిట్ కూడా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. *2. e-Governance మాటలకే:* eGramSwaraj, MGNREGA పోర్టల్ లలో సమాచారం అప్ లోడ్ చేయడం లేదు. దీంతో ప్రజలకు ఆన్ లైన్ లో సమాచారం దొరకడం లేదు. *3. PIO ల నిర్లక్ష్యం:* చాలా శాఖల్లో RTI దరఖాస్తును తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. “ఇది మా దగ్గర లేదు, వేరే శాఖలో ఉంది” అని తిప్పుతున్నారు. 30 రోజుల గడువును పాటించడం లేదు. *4. దాడులు, బెదిరింపులు:* రాష్ట్ర వ్యాప్తంగా RTI కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయి. సమాచారం అడిగినందుకు బెదిరింపులు ఎదుర్కొంటున్న సందర్భాలు మన జిల్లాలో కూడా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. *మనం ఏం చేయాలి? – ఈ దినోత్సవం సందర్భంగా డిమాండ్లు:* 1. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1)(b) అమలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. 2. ప్రతి మండల కేంద్రంలో RTI అవగాహన సదస్సులు నిర్వహించాలి. గిరిజన గ్రామాల్లో గోండీ, కొలామీ భాషల్లో కూడా కరపత్రాలు పంచాలి. 3. జిల్లా సమాచార విభాగంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, RTI దరఖాస్తు రాయడంలో సామాన్యులకు సహాయం చేయాలి. 4. సకాలంలో సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటేనే, మిగతా వారికి బుద్ధి వస్తుంది. RTI అనేది కేవలం ఒక దరఖాస్తు కాదు, అది ఒక సంస్కృతి. ప్రశ్నించే సంస్కృతి. “మా గ్రామంలో రోడ్డు ఎందుకు వేయలేదు? మా పాఠశాలకు నిధులు ఏమయ్యాయి?” అని అడగడం ప్రతి పౌరుడి బాధ్యత. అధికారులు సమాధానం చెప్పడం వారి బాధ్యత మాత్రమే కాదు, చట్టపరమైన విధి. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా, ప్రతి యువకుడు RTI ని ఒక ఆయుధంగా మలుచుకోవాలి. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. అవినీతి అంతం అవుతుంది. సమాచారం అడగండి – ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మీ కృష్ణ రాంటెంకి సమాచార హక్కు చట్టం శిక్షకులు.

ASIFABAD

కిష్టాపూర్‌లో సర్పంచ్ భర్త అరాచకం?

సర్పంచ్ భర్త పేరుతోనే వరుస చెల్లింపులా? అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులా.. సమగ్ర విచారణకు గ్రామస్థుల డిమాండ్ బోర్‌వెల్ మెటీరియల్, గేట్‌వాల్స్ బిల్లులపై అధికారుల పరిశీలన ఎప్పుడు? తేదీ: 07-09-2026 పున్నమి రిపోర్టర్ | రెబ్బెన రెబ్బెన మండలం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కిష్టాపూర్ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు, పంచాయతీ నిధుల వినియోగంపై గ్రామస్థులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ నుంచి జరిగినట్లు చెబుతున్న కొన్ని చెల్లింపులు సర్పంచ్ భర్త పేరుతోనే ఎందుకు జరుగుతున్నాయని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. రూ.1.17 లక్షల బోర్‌వెల్ మెటీరియల్ బిల్లు? గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోర్‌వెల్ మెటీరియల్ కోసం రూ.1,17,725, అలాగే రెండు గేట్‌వాల్స్ కోసం రూ.1,00,452 సర్పంచ్ భర్తకు గ్రామపంచాయతీ నుంచి చెల్లించినట్లు వారు పేర్కొంటున్నారు. ఇవే కాకుండా మరికొన్ని లావాదేవీలు కూడా జరిగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ చెల్లింపులకు సంబంధించి అసలు మెటీరియల్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరు సరఫరా చేశారు? సరఫరా చేసిన మెటీరియల్‌కు సంబంధించిన బిల్లులు, వర్క్ ఆర్డర్లు, వౌచర్లు, రికార్డులు ఉన్నాయా? అనే విషయాలను అధికారులు పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. సర్పంచ్ భర్తకు ఏ వ్యాపారం ఉంది? పంచాయతీకి సంబంధించిన పలు బిల్లులు సర్పంచ్ భర్త పేరుతోనే చెల్లిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో గ్రామస్థులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. సర్పంచ్ భర్తకు పెట్రోల్, డీజిల్ బంక్ ఉందా? JCB ఉందా? బోర్‌వెల్ మెటీరియల్ విక్రయించే దుకాణం ఉందా? లేదా ఇతర సంబంధిత వ్యాపారాలు నిర్వహిస్తున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వ్యాపార రిజిస్ట్రేషన్, బిల్లులు, సరఫరా రికార్డులు, పంచాయతీ చెల్లింపుల వివరాలను అధికారులు పరిశీలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులా? గ్రామ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా గ్రామస్థులు చేస్తున్నారు. ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి పనులు, పంచాయతీ నిధుల వినియోగంపై ప్రశ్నించడం తమ హక్కు అని వారు పేర్కొంటున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై పారదర్శకంగా చర్చించాల్సింది పోయి, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం జరిగితే దీనిపై కూడా అధికారులు విచారణ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శిపై విచారణ జరపాలి కిష్టాపూర్ గ్రామపంచాయతీలో జరిగినట్లు చెబుతున్న అన్ని చెల్లింపులు, అభివృద్ధి పనులు, మెటీరియల్ కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్, ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ భర్త పేరుతో జరిగినట్లు చెబుతున్న చెల్లింపులపై బిల్లులు, వౌచర్లు, వర్క్ ఆర్డర్లు, మెజర్‌మెంట్ బుక్‌లు, సరఫరా వివరాలు, బ్యాంకు లావాదేవీలు పరిశీలించాలని వారు కోరుతున్నారు. విచారణలో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు లేదా ఇతర అవకతవకలు నిర్ధారణ అయితే, బాధ్యులైన సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత సర్పంచ్ భర్తపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు లెక్క చెప్పాల్సిందేనని, పంచాయతీ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.

ASIFABAD

కిష్టాపూర్‌లో అర్ధరాత్రి దొంగతనం.. రూ.25 వేల నగదు, 5 తులాల వెండి చోరీ

తేదీ: 24-08-2026 | పున్నమి రిపోర్టర్ రెబ్బెన మండలం: కిష్టాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరగడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. గ్రామానికి చెందిన బట్టి జానకిరామ్ దుకాణంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.25 వేల నగదు, 5 తులాల వెండి అపహరించినట్లు బాధితుడు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే బాధితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. దొంగలను త్వరగా గుర్తించి, చోరీకి గురైన సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఆవేదన గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన కొన్ని సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతు చేసి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో భద్రతా చర్యలపై గ్రామ పరిపాలన, సంబంధిత అధికారులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు. గ్రామాభివృద్ధిపై ప్రజల అసంతృప్తి గ్రామంలో భద్రత, మౌలిక వసతుల విషయంలో పాలకులు, అధికారులు తగినంత శ్రద్ధ చూపడం లేదని కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామాభివృద్ధి విషయంలో సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇకపై గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ASIFABAD

రెబ్బెన రెవెన్యూ కార్యాలయంలో దుమారం!

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి 2019 జూన్‌ నాటి వ్యవహారం.. వీఆర్వో సెలవులో ఉండగా 9 మంది రైతులపై కేసులు ఎలా? కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన(ఆగష్టు 22): రెబ్బెన మండల రెవెన్యూ కార్యాలయంలో 2019 జూన్‌ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్‌ వివరాలు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది. వీఆర్వో సెలవులో.. రైతులపై కేసులు ఎలా? ఆర్టీఐ ద్వారా అందిన సమాచారంలో 2019 జూన్‌ నెల మొత్తం సంబంధిత వీఆర్వో సెలవులో ఉన్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే అదే సమయంలో తొమ్మిది మంది రైతులపై కేసులు నమోదు చేసినట్లు రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. వీఆర్వో జూన్‌ నెల మొత్తం సెలవులో ఉన్నప్పుడు, సంబంధిత రెవెన్యూ వ్యవహారాల్లో రైతులపై కేసులు నమోదు చేయడానికి అనుసరించిన ప్రక్రియ ఏమిటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. వీఆర్వో సెలవులో ఉన్న సమయంలో తొమ్మిది మంది రైతులపై కేసులు ఏ ప్రాతిపదికన నమోదు చేశారు? దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రజలు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ హాజరుపైనా ప్రశ్నలు మరోవైపు, సంబంధిత కాలానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ హాజరు రిజిస్టర్‌లో సంతకాలు లేవని ఆర్టీఐ ద్వారా వెల్లడైనట్లు సమాచారం. హాజరు రిజిస్టర్‌లో సంతకం లేకపోతే సంబంధిత అధికారి నిజంగా కార్యాలయానికి హాజరయ్యారా? లేదా? అనే అంశంపై స్పష్టత అవసరమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హాజరు రిజిస్టర్‌లో సంతకాలు లేకుండా విధులకు హాజరైనట్లు ఎలా నిర్ధారిస్తారు? అదే సమయంలో తొమ్మిది మంది రైతులపై కేసులు నమోదు చేసే ప్రక్రియ ఎలా జరిగింది? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. హాజరు రిజిస్టర్‌ కీలకం ఒక ప్రభుత్వ అధికారి కార్యాలయానికి విధులకు హాజరయ్యారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు హాజరు రిజిస్టర్‌ ముఖ్యమైన అధికారిక రికార్డుగా పరిగణించబడుతుంది. ఉద్యోగుల జీతభత్యాల ప్రక్రియలోనూ హాజరు వివరాలకు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కీలక రికార్డులో సంతకాలు లేకపోవడం, అదే సమయంలో సంబంధిత అధికారిక చర్యలు కొనసాగినట్లు రికార్డులు ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలి 2019 జూన్‌ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్‌, వీఆర్వో సెలవు వివరాలు, తొమ్మిది మంది రైతులపై నమోదైన కేసులకు సంబంధించిన ఫైళ్లు, ఆదేశాలు, నోట్‌ఫైళ్లు, సంబంధిత అధికారుల విధుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేశారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విచారణతోనే అసలు నిజాలు బయటపడతాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ASIFABAD

శిథిలావస్థలో అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందా?

కిష్టాపూర్‌లో కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం పైకప్పు నుంచి ఊడిపడుతున్న పెచ్చులు.. భయాందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ రెబ్బెన, ఆగస్టు 13: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంగన్వాడీ భవనం పరిస్థితి దారుణంగా ఉండటంతో ప్రస్తుతం గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే కమ్యూనిటీ హాల్‌ పైకప్పు నుంచి స్లాబ్‌ పెచ్చులు ఊడిపడుతున్నాయని, దీంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు చదువుకునే ప్రదేశంలోనే పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి బదులుగా కిష్టాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మించి, చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్ కిష్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కమ్యూనిటీ హాల్‌ పైకప్పు పరిస్థితిని పరిశీలించి, ప్రమాదం సంభవించేలోపు మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారంగా నూతన అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

ASIFABAD

ప్రజావాణి ఫిర్యాదులు వృథానేనా? భూ సమస్యపై అధికారుల నిర్లక్ష్యంపై రైతు మండిపాటు!

ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటున్న రైతు శ్రీనివాస్ . “ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ప్రజావాణి కార్యక్రమాలు ఎందుకు?” కలెక్టర్‌ స్పందించి సమస్య పరిష్కరించాలని బాధితుడి డిమాండ్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా | రెబ్బెన | 11-08-2026పున్నమి ప్రతినిధి రెబ్బెన: భూ సమస్య పరిష్కారం కోసం 20-04-2026న రెబ్బెన తహసీల్దార్‌ (ఎమ్మార్వో)కు దరఖాస్తు చేసినా నాలుగు నెలలు గడిచినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రైతు దుర్గం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సమర్పించిన దరఖాస్తుపై ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని, అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించాల్సిన అధికారులు దరఖాస్తులపై స్పందించకపోవడం బాధాకరమని శ్రీనివాస్ మండిపడ్డారు. “ప్రజా సమస్యలను తుంగలో తొక్కుతున్నారు” “ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అధికారులను ఆశ్రయిస్తున్నారు. కానీ దరఖాస్తులు ఇచ్చిన తర్వాత కూడా స్పందన లేకపోతే ఎవరిని ఆశ్రయించాలి?” అని శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నప్పటికీ, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపడం సరికాదని పేర్కొన్నారు. “ప్రజావాణి కార్యక్రమాలు వృథా కావద్దు” ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు స్పందించకపోతే వాటి ఉద్దేశం నెరవేరదని శ్రీనివాస్ అన్నారు. తన భూ సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని తెలిపారు. దరఖాస్తుపై అధికారులు తీసుకున్న చర్యల వివరాలను కూడా తనకు తెలియజేయాలని కోరారు. కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్ తన సమస్యను వెంటనే పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దుర్గం శ్రీనివాస్ కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ హరిత స్పందించి, దరఖాస్తుపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు తన భూ సమస్యకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.