संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ASIFABAD

సమాచారం ప్రజల హక్కు – దాచడం నేరం! RTI చట్టానికి 21 ఏళ్లు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సమాచారం ప్రజల హక్కు – దాచడం నేరం! RTI చట్టానికి 21 ఏళ్లు.

खबर की मुख्य बातें

  • ఆసిఫాబాద్ న్యూస్ సమాచారం ప్రజాస్వామ్య చరిత్రలో అక్టోబర్ 12, 2005 ఒక చారిత్రాత్మక రోజు.
  • ఆ రోజే సామాన్యుడి చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టింది.
  • అదే సమాచార హక్కు చట్టం - 2005 (Right to Information Act, 2005).

ఆసిఫాబాద్ న్యూస్
సమాచారం ప్రజాస్వామ్య చరిత్రలో అక్టోబర్ 12, 2005 ఒక చారిత్రాత్మక రోజు. ఆ రోజే సామాన్యుడి చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అదే సమాచార హక్కు చట్టం – 2005 (Right to Information Act, 2005). నేటికి ఈ చట్టం అమలులోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 21 ఏళ్ల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, సాధించింది ఎంతో, సాధించాల్సింది ఇంకెంతో అర్థమవుతుంది.

*RTI పుట్టుక వెనుక పోరాటం:*

ఈ చట్టం ఊరికే రాలేదు. రాజస్థాన్ లోని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) చేసిన సుదీర్ఘ పోరాటం, అరుణా రాయ్ లాంటి సామాజిక కార్యకర్తల త్యాగం ఫలితంగా ఈ చట్టం వచ్చింది. “మన డబ్బు – మన లెక్క” అనే నినాదంతో మొదలైన ఈ ఉద్యమం, చివరికి పార్లమెంట్ ను కదిలించింది.

*చట్టం చెప్పేది ఏమిటి?*

చాలా సింపుల్. ఈ దేశ పౌరుడైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అడిగే హక్కు ఉంది. పార్లమెంట్ నుండి పంచాయతీ వరకు, ప్రధానమంత్రి కార్యాలయం నుండి గ్రామ కార్యదర్శి వరకు ఎవరైనా జవాబు చెప్పాల్సిందే. కేవలం 10 రూపాయల ఫీజుతో దరఖాస్తు పెడితే, 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. ఇవ్వకపోతే, తప్పుడు సమాచారం ఇస్తే సంబంధిత అధికారికి రోజుకు రూ.250 చొప్పున రూ.25,000 వరకు జరిమానా విధించే అధికారం సమాచార కమిషన్ కు ఉంది (సెక్షన్ 20).

*కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి:*

మన జిల్లా అటవీ, గిరిజన ప్రాంతం. ఇక్కడే ఈ చట్టం ఎక్కువ అవసరం. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

*1. సెక్షన్ 4(1)(b) – కాగితాలకే పరిమితం:* చట్టం ప్రకారం ప్రతి కార్యాలయం 17 అంశాల సమాచారాన్ని స్వచ్ఛందంగా బోర్డు మీద పెట్టాలి. బడ్జెట్ ఎంత? పనులకు ఎంత ఖర్చు చేశారు? ఉపాధి హామీలో ఎన్ని రోజులు పని ఇచ్చారు? కానీ జిల్లాలోని 90% పంచాయతీల్లో ఈ బోర్డులు లేవు. కాగజ్ నగర్, సిర్పూర్, ఆసిఫాబాద్ మండలాల్లోని చాలా పంచాయతీల్లో 2023 తర్వాత ఆడిట్ కూడా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి.

*2. e-Governance మాటలకే:* eGramSwaraj, MGNREGA పోర్టల్ లలో సమాచారం అప్ లోడ్ చేయడం లేదు. దీంతో ప్రజలకు ఆన్ లైన్ లో సమాచారం దొరకడం లేదు.

*3. PIO ల నిర్లక్ష్యం:* చాలా శాఖల్లో RTI దరఖాస్తును తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. “ఇది మా దగ్గర లేదు, వేరే శాఖలో ఉంది” అని తిప్పుతున్నారు. 30 రోజుల గడువును పాటించడం లేదు.

*4. దాడులు, బెదిరింపులు:* రాష్ట్ర వ్యాప్తంగా RTI కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయి. సమాచారం అడిగినందుకు బెదిరింపులు ఎదుర్కొంటున్న సందర్భాలు మన జిల్లాలో కూడా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం.

*మనం ఏం చేయాలి? – ఈ దినోత్సవం సందర్భంగా డిమాండ్లు:*

1. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1)(b) అమలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి.

2. ప్రతి మండల కేంద్రంలో RTI అవగాహన సదస్సులు నిర్వహించాలి. గిరిజన గ్రామాల్లో గోండీ, కొలామీ భాషల్లో కూడా కరపత్రాలు పంచాలి.

3. జిల్లా సమాచార విభాగంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, RTI దరఖాస్తు రాయడంలో సామాన్యులకు సహాయం చేయాలి.
4. సకాలంలో సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటేనే, మిగతా వారికి బుద్ధి వస్తుంది.

RTI అనేది కేవలం ఒక దరఖాస్తు కాదు, అది ఒక సంస్కృతి. ప్రశ్నించే సంస్కృతి. “మా గ్రామంలో రోడ్డు ఎందుకు వేయలేదు? మా పాఠశాలకు నిధులు ఏమయ్యాయి?” అని అడగడం ప్రతి పౌరుడి బాధ్యత. అధికారులు సమాధానం చెప్పడం వారి బాధ్యత మాత్రమే కాదు, చట్టపరమైన విధి.

21 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా, ప్రతి యువకుడు RTI ని ఒక ఆయుధంగా మలుచుకోవాలి. అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. అవినీతి అంతం అవుతుంది.

సమాచారం అడగండి – ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

మీ కృష్ణ రాంటెంకి
సమాచార హక్కు చట్టం శిక్షకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *