చరిత్రలో గుడిమల్లాం

0
443

భారతదేశ అతి ప్రాచీన శివాలయాల్లో ఇది ఒకటి
పురుష లింగాకారంలో వుండే శివలింగం ఇక్కడి ప్రత్యేకత
ప్రపంచంలోనే అరుదైన శివలింగం
రేణిగుంటకు 15 కి.మీ. దూరంలో ఆలయం వుంది

చిత్తూరు జిల్లాలో అతి ప్రాచీన శైవ క్షేత్రం గుడిమల్లాం. గుడిపల్లం కాలక్రమేణా గుడి మల్లాంగా మారింది. నెల్లూరు జిల్లాలో తిరుగుడుపల్లం కాలక్రమేణా తిరుగుడు మల్లాంగా మారి ప్రస్తుతం మల్లాంగా పిలవ బడుతున్నది. గుడి పల్లంలో వుండడం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చింది అని కొందరంటే పల్లవుల కాలం నాటి గుడి గనుక గుడిపల్లం అనే పేరువచ్చిందని మరికొందరంటారు. ఈ గ్రామం ఏర్పేడు మండలంలో వుంది. రేణిగుంటకు 15 కి.మీ.దూరంలోను, పాపా నాయుడు పేటకు 3 కి.మీ.దూరంలోను వుంది. ఇందులో వున్న ఆలయం పేరు పరశురామేశ్వర ఆలయం.
భారతదేశంలో వుండే అతి ప్రాచీన శివాలయాల్లో ఇది ఒకటని చరిత్రకారుల అభిప్రాయం. ఇలాంటి ఆలయం నేపాల్‌లో కూడా ఒకటి వుందంటారు. క్రీ.పూ.రెండు శతాబ్దాలకు ముందర ఈ ఆలయం నిర్మించబడింది. క్రీ.పూ.50వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించబడి క్రీ.శ.1125లో పూర్తి చేయబడింది. ఈ ఆలయం శాతవాహనులకు సామంతులైన బాణులు కట్టారని కొందరి అభిప్రాయం. పల్ల వులు, చోళులు, యాదవులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు.

అప్పటి రాజభాషలైన ప్రాకృతము, పాళి భాష శాసనాలు ఈ ఆలయంలో నిలువెత్తు రాళ్ళ మీద కనిపిస్తాయి. ఆలయ గర్భగుడి గజపృష్ఠ ఆకారంలో కనిపిస్తుంది. గజపృష్ఠ అంటే ఏనుగు యొక్క వెనుక భాగం. దీనిని బట్టి కొందరు ముందు ఈ దేవాలయం బౌద్ద ఆరామంగా వుండి వుండవచ్చునని ఊహి స్తున్నారు. అంతేగాక పల్లంలో వున్న శివ లింగం చుట్టూ బౌద్ద నిర్మాణాలను పోలిన కట్టడాలున్నాయి. అందువల్ల బౌద్ద ఆరామంగా దీనిని ఊహిస్తున్నారు. మొత్తం మీద ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఎంతో పరి శోధన జరగవలసి వుంది. అప్పుడు గాని ఈ ఆలయాన్ని గురించిన పూర్తి వివరాలు తెలియవు.
ఈ ఆలయ ప్రత్యేకత శివలింగం. మామూలు శివాలయాల్లో వున్న శివ లింగానికి ఈ ఆలయంలో వున్న శివలింగా నికి చాలా తేడా వుంది. అచ్చు మానవ పురుష లింగం ఆకారంలో ఈ శివలింగం చెక్కబడింది. ఎందుకలా జరిగింది అనేది అంతుపట్టని విషయం. ఈ విచిత్రమైన విషయాన్ని విన్న ప్రముఖ చరిత్రకారులు రాహుల్‌ ‌సాలంకృత్యాయన్‌ ఈ ఆలయాన్ని సందర్శిం చారు. ఇక్కడి నిర్మాణ శైలికి అచ్చెరు వొందారు. పడమటి వైపున గోడలో నగలు దాచ డానికి ఏర్పాటు వుంది. రాయిని జరిపితే లోపల పెట్టెలాగా కనిపిస్తుంది. అక్కడ అలాంటి నిర్మాణం వుందని ఎవరైనా చెబితే కాని మనం కనుక్కోలేము. దైవ ఆభరణాలను దాచడానికి శిల్పి చేసిన చమత్క ృతి అది.

ఆలయంలో అనేక చిన్నచిన్న గుడులున్నాయి. వాటిలో సూర్య నారాయణ స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, పార్వతీ దేవాలయం మొదలైనవి ముఖ్య మైనవి. మన రాష్ట్రంలో అరసవెల్లి తరువాత సూర్య నారా యణ విగ్రహం ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది మరియు అనాదిగా ఆరాధనలను అందు కొంటుంది. ఇటీవల వరకు ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి రాజులు పోషిస్తూ వుండేవారు. ఉత్సవాలు జరు పుతూ వుండే వారు. ఈ మధ్య కాలంలో పురావస్తు శాఖ వారు ఆలయాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి పరుస్తున్నారు.
ఆలయానికి వెనుక పెద్ద కోనేరు, ఉత్త రము వైపున వున్న బావి చాలా పురాతన మైనవి. ముప్పై ఏళ్ళ క్రిందట ఈ బావి నీటితో పొంగి ఆ నీరు గర్భగుడిలోకి వచ్చిందంటారు. శివలింగం మీద పరశురాముడు గండ్రగొడ్డలి చేతబూని కనిపిస్తాడు. ఆ దిగువన బ్రహ్మ చెక్కబడి వున్నాడు. మహాశివరాత్రి ఉత్సవాల ను, కార్తీక సోమవారం, శ్రావణ శుక్రవారం అభిషేకాలను ప్రస్తుతం జరుపుతున్నారు. దేశం లోని పలు ప్రాంతాల నుంచి ఈ వింత ఆలయాన్ని చూడడానికి జనం వస్తుంటారు. ఆల యంలో డమరుక శబ్దం వినపడుతూ వుంటుం దని, మూలవిరాట్‌ ‌దగ్గర అర్ధరాత్రి గజ్జెల శబ్దం వినిపిస్తుందని, ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలో వింత శబ్దం వినపడుతుందని స్థానికులు కథలు కథలుగా చెపుతుంటారు.

ఒకసారి ఆలయాన్ని శుద్ధి చేయడానికి పురావస్తుశాఖ వారు రసాయనాలు చల్లారు. ఆ విషయం తెలియని భక్తులు కర్పూరం వెలిగించారు. పెద్ద అగ్ని ప్రమా దం ఆలయంలో జరిగింది. ఆ ప్రమా దంలో నలుగురు చనిపోగా మరికొంత మంది గాయపడ్డారు. ఇది ఆలయ చరి త్రలో ఒక విషాదం. మొత్తం మీద ఒక గొప్ప చారిత్రక నేపథ్యం గల ఆలయం గుడిమల్లాం పరశురామేశ్వరాలయం. ఇంత మారుమూల గ్రామంలో అప్పుడు ఇంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని ఎందుకు నిర్మించారా? అని సందేహం కలుగుతుంది ఎవరికైనా! ఈ ప్రశ్నకు జవాబుగా ఒకప్పుడు స్వర్ణముఖి నది ఒడ్డున వున్న పెద్ద పట్టణం ఈ ఊరని స్థానికులు అం టారు. ఇది నిజమే అయివుండవచ్చని అనిపిస్తుంది.

డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌,
‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు.
సెల్‌ : 9441895343