


08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రెసిడెంటు బంకా తిరుపతి రెడ్డి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఆనాటి ప్రభుత్వాలు 1996 సంవత్సరంలో ఒక చట్టాన్ని కూడా రూపొందించారని దానికి 1000 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీనిని నేటి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు అంటే బేల్దారులు, కొయ్యి పని, కరెంటు పని, పెయింట్ పని, ఇలా ఇరవై మూడు రకాల పనులు చేసుకునేవారు ఈ సంఘం పరిధిలోకి వస్తారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల కార్య సాధనకై ఒక బోర్డులు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నిధులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి కార్మికుడికి 110 రూపాయలను కట్టించుకుని ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగిందని, ఈ గుర్తింపు కార్డు గడువు తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి కూడా సౌకర్యం ఉందని చెప్పారు. ఈ గుర్తింపు కార్డు ఉన్న వారికి కాన్పు కానుక కింద 20 వేల రూపాయలను అలాగే సహజ మరణానికి 80,000, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల నలభై వేలు ఇస్తారని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా బోర్డు నిధుల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదే కాకుండా ఉదాహరణకి 10 లక్షల రూపాయలు భవన నిర్మాణం జరుపుతున్న యజమాని మున్సిపాలిటీ పరిధిలో అయితే చెస్సు రూపంలో లక్ష కి వెయ్యి రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ కు కడుతున్నారని అన్నారు. ఇలా బోర్డు కు వచ్చిన ప్రతి రూపాయి ని భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి నియోగించాలని తెలియజేసారు. భవన నిర్మాణంలో పని చేసే ప్రతి కార్మికుడు ప్రతి క్షణం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారని అంతేకాకుండా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ కాలం బ్రతకడని శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వాలు చేతి వృత్తి పనులు చేసుకునే ఇతర కులాల వారికి ఏ విధంగా అయితే పథకాలను ప్రవేశపెట్టి లబ్ధి చేకూరుస్తున్నారో అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కూడా గుర్తించాలని అంటున్నారు. జిల్లా మొత్తం మీద 10 ఆఫీసులు ఉండగా ఏ ఆఫీసులోనూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార పనితీరుపై అసంతృప్తికరంగానే ఉందని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు చాలా పర్యాయాలు ఫిర్యాదు చేసి ఉన్నామని అన్నారు. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు మూడు నెలలు లాక్ డౌన్ విధించడంతో అనేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు ఎవరూ పట్టించుకోలేదని తన ఆవేదనను వ్యక్తస్తున్నాడు. రాష్ట్రంలోని మిగతా మంత్రులు లాగా కార్మిక శాఖ మంత్రి కూడా ఉన్నాడా లేడా అని ఆయన ప్రశ్నించాడు. ఒకవేళ ఉంటే మిగతా మంత్రులు లాగే కార్మికుల గురించి స్టేట్మెంట్లు కానీ లేదా ప్రెస్ మీట్ లో గానీ ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల ను గుర్తించి వారి యొక్క సమస్యలపై దృష్టి సారించి ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున కోరుకుంటున్నానని అన్నారు.