మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు అవసరం
నెల్లూరు, అక్టోబర్ 11 (పున్నమి విలేకరి) : చదువుతో పాటు మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు ఆడటం ఎంతో అవసరమని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాలల పురుషుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచి విద్యను అందించాలని చూస్తున్నారే తప్ప క్రీడల పట్ల ఆలోచన చేయడం లేదు. సమాజంలో రాణించాలంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. సమాజంతో పోటీ పడేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. గెలుపోటములను తట్టుకుని నిలబడే మానసిక స్థితి, మనో స్థైర్యం క్రీడల ద్వారా మెరుగుపడతాయి. అన్ని క్రీడల పట్ల ఆసక్తి చూపించండి కానీ, గ్రామీణ క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించకండి. తల్లితండ్రులు సమాజంలో తమ బిడ్డ పేరు గర్వంగా చెప్పుకునే స్థాయికి అందరూ ఎదగాలని ఆయన తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు.