నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు ఆ పేరెలా వచ్చింది
దాదాపు వెయ్యేళ్ల కిందటే ముత్తుకూరు ఒక ప్రసిద్ధ గ్రామం. సమీపాన వున్న కృష్ణపట్నం రేవు ద్వారా ముత్తుకూరుకు ఎంతో ప్రాధాన్యం వుండేది. ముత్యాల ఎగుమతి జరగడం వలన ఆ వూరికి ఆ పేరు వచ్చిందంటారు. 13వ శతాబ్ధంలో సింహపురిని ఏలిన మనుమసిద్ధి తండ్రికి ‘గండగోపాల’ అనే బిరుదు వుండేది. ఆయన కాలంలోనే సిద్ధేశ్వరాలయం నిర్మించబడింది. మనుమసిద్ధి కాలంలో అభివృద్ధి పరచబడి, మనుమసిద్ధేశ్వరాలయం అయ్యింది. కృష్ణపట్నాన్ని అప్పట్లో గండగోపాలపట్నం అని కూడా పిలిచేవారు. ప్రాచీన కాలంలో కృష్ణపట్నానికి ‘కొల్లితురై’ అనే పేరుండేది. తురై అంటే రేవుపట్నం. దీన్ని బట్టి ముత్తుకూరు, దాని పరిసరాలు ప్రాచీనకాలంలోనే ఎగుమతులు, దిగుమతులకు ఆలవాలమై విదేశీ వ్యాపారానికి పేరెన్నికగన్నవని చెప్పవచ్చు. ప్రస్తుతం ముత్తుకూరుకు కూతవేటు దూరంలో ప్రపంచంలో గొప్ప రేవుపట్టణాలలో ఒకటిగాను, మన రాష్ట్రంలో ఆర్థిక వనరులను సృష్టించేందుకు నెంబర్ వన్‌గాను కృష్ణపట్నం ఓడ రేవు వెలుగొందుతుంది. కృష్ణపట్నం వలనే ప్రస్తుతం ముత్తుకూరుకు ప్రపంచ స్థాయి ప్రాధాన్యత సంతరించుకుంది.