పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 05 : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట జీహెచ్ఎంసీ పరిధి ప్రశాంత్ నగర్ ఫేజ్–1లో సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకున్న అపశృతి స్థానికులను కలచివేసింది. రాజులూరి గ్రామానికి చెందిన గణేష్ (వయస్సు 15 సంవత్సరాలు) అనే బాలుడు తన మేనత్త ఇంటికి వచ్చిన సందర్భంగా గాలిపటం ఎగరేస్తుండగా, అది హై టెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకుంది. గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై, శరీరంపై తీవ్ర గాయాలు కాగా మంటలు అంటుకున్నాయి.తక్షణమే బాధితుడిని ప్రథమ చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, బాధితుడికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. గణేష్ త్వరగా కోలుకొని సాధారణ జీవన స్రవంతిలోకి రావాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయ్ దిండు భూపేష్ గౌడ్ ఆర్కల కామేష్ రెడ్డి మా దారి రమేష్ బొక్క రాజేందర్ రెడ్డి అవినాష్ తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



