గాజువాక : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో గాజువాకలో రేపు (12.12.2025, శుక్రవారం) మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. శ్రీనగర్‌లోని టి.ఎస్.ఆర్. & టి.బి.కె. (ఆపిల్ ఐ స్కూల్) ప్రాంగణంలో ఉదయం నుంచి ఈ మేళా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సుమారు 40 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఐటీ, రిటైల్, సేల్స్, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్, కస్టమర్ సపోర్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా, జూనియర్ స్థాయి నుంచి మిడ్ లెవెల్ పోస్టుల వరకు వివిధ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగ యువత, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ గాజువాక శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి అభ్యర్థి ఈ మేళాకు హాజరై కంపెనీల ప్రతినిధులతో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని చెప్పారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించబడినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉద్యోగ ఆశావహులు బయోడేటా, అవసరమైన పత్రాలు, ఐడీ ప్రూఫ్‌లు వెంట తీసుకొని రావాలని సూచించారు.


