వెల్దండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీసీ సంఘం నేతలు, బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టం చేయడంతో బీసీల ఆశలపై గండి పడింది. కనీసం గతంలో ఉన్న స్థానాలు అయినా వస్తాయని భావించిన వెల్దండ మండల బీసీల ఆశలు అడియాశలయ్యాయి. మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవుల రిజర్వేషన్‌లో కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం.
జనరల్—10, ఎస్సీ—5,ఎస్టీ—13, బీసీ—4, జనరల్ , 100 శాతం ఎస్టీలు ఉన్న తండాలకు రిజర్వు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టైంది వెల్దండ మండల సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియ” అని వ్యాఖ్యానిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ వస్తుందని ఆశపడితే, ఉన్న రిజర్వేషన్‌లోనే కోత పడుతుందని ఎవరూ ఊహించలేదు. వెల్దండ మండలంలో 2019 సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 6 స్థానాలు కేటాయిస్తే, 2025లో 42 శాతం ప్రకారం 10 స్థానాలు రావాల్సి ఉంది. అయితే ఈ రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో, ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీసీలకు కేవలం 4 గ్రామాల్లోనే రిజర్వేషన్ కేటాయించడం స్థానికులలో ఆశ్చర్యానికి, ఆగ్రహానికి కారణమైంది.


