కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మన్విష్, మన్విత్ దుర్మరణం చెందారు.
ఈ విషాద ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయగిరి నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు సమాచారం అందించి, ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో సంప్రదించి మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
“ఒకే కుటుంబం నిండుగా నష్టపోవడం హృదయవిదారకమైన విషయం. ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది,” అని వెంకటరెడ్డి అన్నారు. మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా వారికి అండగా నిలుస్తుంది,” అని ఆయన హామీ ఇచ్చారు.


