థ్రిల్లర్ జానర్‌కి సంబంధించిన కంటెంట్ ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్‌లతో పాటు ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్‌లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. రాజకీయ నేపథ్యంలోని ఈ తరహా కథలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఇలాంటి సిరీస్‌ల వరుసలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది ‘మహారాణి’ వెబ్ సిరీస్. హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ‘సోనీ లివ్’లో ప్రసారం అవుతోంది. సాధారణ గృహిణి ఒకరు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే కథనే ఇది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్‌లకు అద్భుతమైన స్పందన లభించింది.
ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు సీజన్ 4 రెడీ అయింది. అధికారిక ప్రకటన ప్రకారం, నవంబర్ 7వ తేదీ నుంచి ‘మహారాణి సీజన్ 4’ స్ట్రీమింగ్‌కి రానుంది. తాజా ట్రైలర్‌లో, ముఖ్యమంత్రిగా ఎదిగిన మహారాణి ఇక ప్రధాని పీఠం వైపు ప్రయాణం మొదలుపెట్టినట్టు చూపించారు.
ఈ సీజన్‌లో హ్యూమా ఖురేషితో పాటు శ్వేతా బసు ప్రసాద్, విపిన్ శర్మ, అమిత్ సియాల్, వినీత్ కుమార్, శార్దూల్ భరద్వాజ్, ప్రమోద్ పాఠక్ వంటి పలువురు ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈసారి మహారాణి ఎలాంటి రాజకీయ ఆటలు ఆడబోతుందో, అధికార శిఖరాలను ఎలా అధిరోహించబోతుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


