*9, 10 తేదీలలో విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0*
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి *
*మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాక
*ఏర్పాట్లపై సమీక్షించిన జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్
విశాఖపట్నం, జనవరి 07 ః విశాఖపట్టణం వైభవాన్ని మరింత చాటిచెప్పేలా పోర్ట్స్, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 09, 10వ తేదీల్లో ఎంజీఎం పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర విశేషాలతో కూడిన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం అవుతున్నారని వెల్లడించారు. గతంలో గోవా, పూరీ నగరాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో, విశాఖలో ఈ సారి మరింత వైభవంగా నిర్వహించేందుకు పోర్టు అధికారులు, జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జేసీ సూచించారు.
లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పోర్ట్ అధికారులతో కలిసి కలెక్టరేట్లో మీటింగు హాలులో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, శానిటేషన్ చర్యలు చేపట్టాలని, మెడికల్ క్యాంపు పెట్టడంతో పాతు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని, బస్సులు ఏర్పాటు చేయాలని, మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా విశాఖ నగరానికి పర్యాటక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులు, పోర్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.
సమావేశంలో లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీరేంద్ర యాదవ్, విశాఖ పోర్టు కార్యదర్శి సాంబమూర్తి, సీఏవో రమణమూర్తి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వికాశ్, విశాఖపట్టణం ఆర్డీవో సుధాసాగర్, జీవీఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


