జీవీఎంసీ 48వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, బీజేపీ ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు గంకల కవిత అప్పారావు యాదవ్ జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావును కలసి వినతి పత్రం సమర్పించారు.
గంకల మాట్లాడుతూ, ఇందిరానగర్-2 ప్రాంతంలో వర్షాకాలంలో రిటైనింగ్ వాల్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే 1990లో నిర్మించిన అంగన్వాడీ భవనం పాడైపోవడంతో చిన్నారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవనానికి తక్షణ మరమ్మతులు అవసరమని తెలిపారు.
వార్డులోని ప్రధాన డ్రైనేజీలు, కాలువలు దెబ్బతిన్నాయని వాటి పునర్నిర్మాణం తక్షణం చేపట్టాలని సూచించారు. అదేవిధంగా 75A, 13A, 74A, 76A, 78A, 190A ట్రాన్స్‌ఫార్మర్‌ల పరిధిలో సుమారు 200 వీధి దీపాలు మసకబారిన స్థితిలో ఉన్నాయని, వాటి స్థానంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
వార్డులో సుమారు 10 కొత్త రింగ్ పోల్స్ ఏర్పాటు అవసరమని కూడా గంకల తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధిపై తన వినతిని సానుకూలంగా పరిగణించనున్నట్లు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించినట్లు గంకల పేర్కొన్నారు.


