విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే చారిత్రాత్మకమైన శ్రీ వల్లభాయ్ పటేల్ పారలల్ బ్రిడ్జ్ (Dockyard Bridge) పునర్నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. పాత బ్రిడ్జ్ బలహీనమవడంతో దానిని ఆధునిక సాంకేతికతతో మళ్లీ నిర్మించడానికి పోర్ట్ యాజమాన్యం సుమారుగా ₹30 కోట్ల రూపాయల వ్యయంతో నూతన వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని, నవంబర్ మొదటి వారంలో ఈ బ్రిడ్జ్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడానికి పోర్ట్ యాజమాన్యం అహర్నిశలు కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ వంతెన పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతం మరియు సిటీ ప్రాంతాన్ని కలిపే ఏకైక రహదారి మార్గం కావడంతో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. సుమారు 1½ సంవత్సరాలుగా రాకపోకలు నిలిచిపోయినందున, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలో తొలగబోతున్నాయని సమాచారం. ఈరోజు శ్రీ వల్లభాయ్ పటేల్ పారలల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ప్రత్యక్షంగా సందర్శించి, సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై యాజమాన్యానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
గణబాబు మాట్లాడుతూ — “విశాఖలో రాబోయే *అంతర్జాతీయ సదస్సు (International Submit)*కు వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు, అలాగే ఫిబ్రవరిలో జరగబోయే IFSC సమావేశానికి ప్రముఖులు రాబోతున్నారు. వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం” అని తెలిపారు., “ప్రజల సౌకర్యం దృష్ట్యా, ఈ బ్రిడ్జ్‌ను నవంబర్ మొదటి వారంలో పూర్తిగా ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. ఈ దిశగా అన్ని పనులు దాదాపు పూర్తి అయ్యాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ అంగ ప్రశాంతి, T.N.T.U.C. జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు లక్ష్మణరావు, నాగార్జునరావు, ENC TNTUC ప్రధాన కార్యదర్శి శ్రీను, వర్స్ కమిటీ మెంబర్ నాయుడు, NCE యూనియన్ అధ్యక్షుడు శేఖర్, యూనియన్ ప్రతినిధులు పరమేష్, శివ, రాజారావు, వివిధ కంపెనీల కార్మికులు పాల్గొన్నారు. వంతెన పునర్నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన గౌ. గణబాబు గారికి పారిశ్రామిక ప్రాంత సీనియర్ టీడీపీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోర్ట్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


