గ్రామీణ ప్రాంతాల్లో స్వామిత్వ హక్కుల కల్పన వేగవంతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లోని ఇళ్లు, షాపులు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు “స్వామిత్వ కార్యక్రమం”ను వేగవంతం చేసింది.
2026 మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్షేత్రస్థాయి సర్వేలు పూర్తిచేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ప్రస్తుతం 6 వేల గ్రామాల్లో డ్రోన్ల సాయంతో ఆస్తుల కొలతలు సేకరిస్తూ, ప్రతి ఇంటి సరిహద్దులు, పొడవు–వెడల్పు వివరాలను “ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్” ఆధారంగా రికార్డు చేస్తున్నారు.
ఇప్పటివరకు 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. ప్రజల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ప్రాపర్టీ కార్డులు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్డులు ద్వారా ప్రజలు తమ ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు పొందుతారు.
ఇళ్లు, స్థలాలు సులభంగా అమ్మకాలు–కొనుగోళ్లు చేయవచ్చు.
బ్యాంకు రుణాలు, వారసత్వ బదిలీలు కూడా సులభతరం అవుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఆస్తుల జాబితాలు ప్రదర్శిస్తూ, లోపాలను ప్రజల సూచనలతో సరిచేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నాయని ప్రభుత్వం ఆశిస్తోంది.


