ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం: వెలుగుమట్ల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఆదివారం ఖమ్మం ఐడీఓసి వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖి సమావేశంలో మంత్రి పాల్గొని వారి సమస్యలను స్వయంగా విన్నారు. అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వివరించగా, “మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని మంత్రి భరోసా ఇచ్చారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దళారుల మోసానికి గురై రూ.30 వేల నుంచి రూ.8 లక్షల వరకు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దళారులపై కఠిన చర్యలు తీసుకుని, వారి నుంచి డబ్బులు రికవరీ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గత తొమ్మిది నెలలుగా కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొనగా, కొత్త కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గాల వారీగా గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియా సమావేశంలో ప్రతిపక్షాలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నప్పుడు పేదల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శక సర్వే ద్వారా అర్హులైన వారినే ఎంపిక చేస్తామని తెలిపారు.
ఈ నెల 15న తానే స్వయంగా వచ్చి ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లు అందజేస్తానని మంత్రి వెల్లడించారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ తదితరులు పాల్గొన్నారు.



