నెల్లూరు, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):
పది నెలల క్రితం తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు తీర్పు ఉపశమనం కలిగించింది. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనలతో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా జరిగిన నియామకాలను చెల్లుబాటు చేస్తూ, విధుల్లోకి తిరిగి తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో 1207 జీవో కింద నియమితులైన 920 మంది హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. తొలగింపుల తరువాత జీతాలు ఆగిపోవడంతో అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయని, కొందరు కూలి పనులు చేసుకోవాల్సి వచ్చిందని నేతలు పేర్కొన్నారు.
హెల్త్ అసిస్టెంట్ల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడం ద్వారా ఈ తీర్పు సాధ్యమైందని ఏపీ హెల్త్ అసిస్టెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తెలిపారు.
ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు, జిల్లా కార్యదర్శి కమల్‌కిరణ్ సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. విధుల్లోకి చేరే హెల్త్ అసిస్టెంట్లందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ హంస తాలూకా అధ్యక్షుడు ఆర్.సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాపారావు, హెల్త్ అసిస్టెంట్స్ నాయకులు స్టీఫెన్‌కుమార్, జాన్ ప్రభాకర్ పాల్గొన్నారు.


