
హృదయం అద్దం లాంటిదని, పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదేనని, మన హృదయ శ్రేయస్సు, మన చేతుల్లోనే ఉందని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా. పైడి. సింధూర అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా, స్థానిక సింధూర వైద్యశాలలో రోగులకు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇందులో భాగముగా వైద్యులు డిఎం న్యూరాలజి అమర కార్తీక్, ఎండి జనరల్ మొదలవలస.మురళి, ఇతర వైద్యులబృందంతో కలసి రోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో, వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోందని, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితమే ప్రధాన కారణాలన్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమని, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి శారీరక శ్రమను ప్రతిరోజూ చేయాలని, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యమన్నారు.
వైద్యులు అమర కార్తీక్ మాట్లాడుతూ జంక్ ఫుడ్, చక్కెర, అధిక కేలరీల ఆహారాన్ని నివారించాలని, వీటికి బదులుగా, మీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్, క్యారెట్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలన్నారు. తగినంత నిద్ర, సుమారు 7 నుండి 8 గంటలుగంటలు అవసరమని, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిని మెరుగుపరచుకోవాలన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల. మోహన్, కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు. చరణ్, సింధూర హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

