విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
వైకుంఠం, గంభీరం ఐఐఎం రోడ్‌లో నెలరోజులపాటు వేడుకలు
విశాఖపట్నం హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో దామోదర దీపోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 7 నుండి నవంబర్ 5 వరకు నెలరోజులపాటు జరగనున్న ఈ పూజా కార్యక్రమాలు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరం, హరే కృష్ణ వైకుంఠం, ఐఐఎం రోడ్, గంభీరం వద్ద జరుగుతున్నాయి.
శనివారం ఐదవ రోజు (11-10-2025) అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. రాధా దామోదరుల విగ్రహాలకు మహిళలు దీపాలంకరణ చేసి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
కార్యక్రమంలో ప్రవచనాలు, భజనలు, దామోదర హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరిచాయి. భక్తులు శ్రీ దామోదర అష్టకాన్ని లయబద్ధంగా పాడుతూ స్వయంగా నెయ్యి దీపాలతో కృష్ణునికి హారతి సమర్పించారు. సంగీత వాయిద్యాలతో భజన కార్యక్రమం నిర్వహించబడింది.
హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం అధ్యక్షులు డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ —
“దామోదర వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ కాలంలో ప్రతి భక్తుడు రోజూ శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేయాలి, నెయ్యి దీపం అర్పించాలి, తులసి పూజ చేయాలి, దాన ధర్మాలు ఆచరించాలి,” అని వివరించారు.
అలాగే ఆయన పద్మ పురాణంలో ఉన్న శ్లోకాన్ని ఉటంకిస్తూ —
“కార్తీక మాసంలో శ్రీకృష్ణునికి నెయ్యి దీపం అర్పించుట అన్ని దానాలలో శ్రేష్ఠమైనది. ఎవరు హరి ఆలయంలో దీపారాధన చేస్తారో వారు అనేక కల్పముల పాపఫలాల నుండి విముక్తి పొందుతారు,” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అంబరీష దాస, హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం తరఫున మాట్లాడుతూ —
“ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర దామోదర మాసంలో భగవంతుని భక్తి పారవశ్యములో ఆనందించాలి” అని ఆకాంక్షించారు.


