*విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి*
స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు.
భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ…ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ముందంజలో ఉందన్నారు. నిన్న తొమ్మిది ఐటీ కంపనీలకు శంకుస్థాపన చేసుకున్నాము. మార్చి నెలలో గూగుల్ కు శంకుస్థాపన చేయబోతున్నామని, గూగుల్ విశాఖ ముఖ చిత్రం మార్చబోతుందని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపుచూస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కి సీఎం చంద్రబాబు విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు.
గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… విశాఖ ఎకనామిక్ రీజియన్ తొలి సమావేశం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిందని తెలిపారు. 36 వేల చదరపు కిలోమీటర్లు పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటయిందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ మూలం నీతిఅయోగ్ లక్ష్యాలని, 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఏడూ గ్రోత్ సెక్టర్లు, 49 ప్రాజెక్టులు, ప్రతి మూడు నెలలకు ఒకసారి విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్ష ఉంటుందని అన్నారు. రాజకీయాలు ప్రక్కన పెట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ కు నిధులు తీసుకువచ్చామని, రాష్ట్రం నుంచి నిధులు ఇచ్చామని పేర్కొంటూ, స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో యజమాన్యం, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు.
విశాఖ ఉత్తర శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ…ఎవరు ఊహించని విధంగా విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు . వి ఈ ఆర్ లో 2031 నాటికి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ….విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. ప్రేవేటికరణ అవుతుందనుకున్న స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఐటీ సంస్థలకు 99 పైసలుకె ఎకరం భూమి ఇస్తున్నారని వ్యాఖ్యలు చేసేవారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎకరం భూమి ఒక రూపాయి కె కేటాయించారని తెలిపారు. తక్కువ ధరకు భూములు కేటాయించడం కొత్త కాదు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు.


