*హన్మకొండ*
*తేది: 20.10.2025*
*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు…..*
*రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం……*
*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి గారిని కోరారు.*
హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని శనివారం ఆయన కలిసి వివిధ వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ… నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో తరచుగా విద్యుత్ ఒత్తిడి తగ్గిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి కొత్త ఆపరేషన్ విభాగాలు, సబ్‌స్టేషన్ల మంజూరు అత్యవసరమని కోరారు.
*కొత్త ఆపరేషన్ విభాగాల ఏర్పాటుకు ప్రతిపాదన*
జనగాం జిల్లాలోని జాఫర్‌గఢ్, లింగాల ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల్లో ఒక్క ఆపరేషన్ విభాగం మాత్రమే ఉండడం వల్ల సేవలు సమయానికి అందడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే కొత్త విభాగాల మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
1. కునూర్ ప్రధాన కేంద్రంగా కొత్త ఆపరేషన్ విభాగం (జాఫర్‌గఢ్ విభజన)
2. మల్కాపూర్ ప్రధాన కేంద్రంగా కొత్త ఆపరేషన్ విభాగం (రాజవరం విభజన)
3. వాడిచెర్ల ప్రధాన కేంద్రంగా కొత్త ఆపరేషన్ విభాగం (లింగాల ఘన్‌పూర్ విభజన)
*జాఫర్‌గఢ్‌లో 132/33KV సబ్‌స్టేషన్ ప్రతిపాదన*
జాఫర్‌గఢ్ మండలంలో 7 సబ్‌స్టేషన్లు ఉన్నప్పటికీ, లోడ్లు వేగంగా పెరుగుతున్నందున కొత్త 132/33KV సబ్‌స్టేషన్ అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక మరియు గృహ లోడ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. కొత్త సబ్‌స్టేషన్ ఏర్పడితే విద్యుత్ సరఫరా నాణ్యత పెరుగుతుంది, లో వోల్టేజ్ సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరించారు.
*కొత్త 33/11KV సబ్‌స్టేషన్ల మంజూరుకు విజ్ఞప్తి*
స్టేషన్ ఘనపూర్ మండలంలోని నారాయణపూర్, చిల్పూర్ మండలంలోని నష్కల్, పల్లగుట్ట గ్రామాల్లో తక్కువ వోల్టేజ్ సమస్యలు తీవ్రమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు మోటార్లు కాలిపోవడం, పంటలకు నీటి సరఫరా అంతరాయమవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నారాయణపూర్, నష్కల్, పల్లగుట్ట గ్రామాల్లో 33/11KV సబ్‌స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే లో వోల్టేజ్ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి అన్నారు.
ఎమ్మెల్యే గారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఎన్పీడిసిఎల్ సీఎండి వరుణ్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించి, నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు.


