*బాధితురాలి వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరిపెడ పోలీసులు – సేవా నిబద్ధతకు ప్రశంసలు* మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఇటుకలగడ్డ తండాలో జరిగిన ఒక ఘటనలో మరిపెడ పోలీసులు చూపిన సేవా నిబద్ధత స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. బాధితురాలికి తక్షణ సహాయం అందిస్తూ, ఆమె వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించడం ద్వారా పోలీసులు తమ బాధ్యతాయుత వైఖరిని చాటుకున్నారు.నిన్నటి రోజు బాధితురాలు మిర్చి ఏరడానికి వెళ్లిన సమయంలో అదే తండాకు చెందిన భూక్య బాలు అనే వ్యక్తి ఆమెను వెంబడించి బెదిరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సమయంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో సదరు వ్యక్తి అక్కడి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది.ఘటన అనంతరం బాధితురాలు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న మరిపెడ పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి, బాధితురాలి వద్దకే వెళ్లి ఆమె ఫిర్యాదును స్వీకరించి ఆసుపత్రిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని అక్కడికక్కడే బాధితురాలికి అందజేశారు.మహిళల భద్రత, ప్రజల రక్షణ విషయంలో మరిపెడ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, బాధితులకు న్యాయం చేయడంలో ముందుంటున్నారని స్థానికులు అభినందిస్తున్నారు. పోలీసుల ఈ సేవా దృక్పథం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ, సమాజంలో నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇస్తోంది.ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు మరిపెడ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.* భూక్య రాము నాయక్, పున్నమి రిపోర్టర్ డోర్నకల్ నియోజకవర్గం ,మరిపెడ*


