సుమారు రూ. 18.47 కోట్లతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ శంకుస్థాపన
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: నగర అభివృధ్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ 6వ జోన్ (గాజువాక) లోని 72, 74, 76, 86 వార్డులలో జీవీఎంసీ నిధుల నుండి సుమారు 1847.07 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికే సాధ్యమని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్రతో పాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు.
72 వార్డు పరిధిలోని చిన్న గంట్యాడ, శ్రీనగర్ ప్రాంతాలలో సిసి రోడ్లు, సి సి కాలువలు, కల్వర్టులు నిర్మాణానికి సుమారు రూ. 87.20 లక్షలు, 74 వ వార్డు పరిధిలోని దయాల్ నగర్, అంబేద్కర్ కాలనీ, వియ్యపువానిపాలెం, పెద్ద కోరాడ, దల్లివానిపాలెం, టి జి ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో సిసి రోడ్లు, సి సి కాలువలు, కల్వర్టులు రిటర్నింగ్ వాల్స్ నిర్మాణానికి సుమారు రూ. 217.95 లక్షలు, 76 వార్డు పరిధిలోని నడిపూరు డైరీ కాలనీ, గాంధీనగర్, రిక్షా కాలనీ, పరిసరాల ప్రాంతాలలో వి ఆర్ సి సి కాలువలు, తారు రోడ్లు నిర్మాణానికి సుమారు రూ. 445.99 లక్షలు, 86వ వార్డు పరిధిలోని చిన్నయాతపాలెం, భారత నగర్, రిక్షా కాలనీ, కూర్మం పాలెం తదితర ప్రాంతాలలో సుమారు రూ. 295.93 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శాసనసభ్యులతో కలిసి శంకుస్థాపన చేశామన్నారు.
అనంతరం గాజువాక శాసనసభ్యులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక అభివృద్దే నా ప్రధమ కర్తవ్యం అని, రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళని, గాజువాకలోని అన్ని ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగా సుమారు రూ. 18.47 కోట్లతో గాజువాక జోన్ లోని 72, 74, 76, 86 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు,ఆయా వార్డుల కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, ఎ . జె.స్టాలిన్, తిప్పల వంశీ రెడ్డి, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీరు, కార్యనిర్వహక ఇంజినీరు, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


