విశాఖపట్నం, అక్టోబర్ 25
పున్నమి ప్రతినిధి:
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, శనివారం సిటీ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏడీసీపీలు, ఇన్స్పెక్టర్లతో కలిసి నెలవారీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా సీపీ నగరంలోని ప్రతి స్టేషన్ పరిధిలో యాక్టివ్ రౌడీ షీటర్లపై నిఘా చర్యలు, NDPS కేసుల స్థితిగతులు, ట్రాఫిక్, క్రైమ్, లా & ఆర్డర్ విభాగాల పనితీరు గురించి సమీక్షించారు. నగరంలో ఎటువంటి మత్తు పదార్థాల రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్లలో ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, కోర్టు తీర్పులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సీపీ గారి హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
నగరంలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేయాలని, రాత్రిపూట నిఘా పెంచాలని, అవసరమైతే డికోయ్ టీమ్‌లు, పీకెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవ్‌టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఘటనలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ అంశాలపై ప్రత్యేకంగా చర్చించిన సీపీ గారు, ప్రజలకు మరింత అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని, కొత్త సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి నిందితులను వేగంగా గుర్తించాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పొక్సో కేసులు మరియు మహిళ మిస్సింగ్ కేసులను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఆహ్వానించి, న్యాయ సంబంధిత అంశాలపై పరస్పరం చర్చించారు. లోక్ ఆధాలత్‌లలో మరిన్ని కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
విధులలో పారదర్శకతను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి వాటికి పాల్పడిన ఎవరిపై అయినా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
ఈ సమావేశంలో డీసీపీ (ఎల్ & ఓ) డి. మేరీ ప్రశాంతి, ఐపీఎస్, డీసీపీ (క్రైమ్స్) లతా మాధురి, ఐపీఎస్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే మా ముఖ్య లక్ష్యం. ప్రతి స్టేషన్ సమర్థవంతమైన పోలీసింగ్ చూపాలి” — సీపీ శంఖబ్రత బాగ్చి


