ఖమ్మం, జనవరి
(పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అలాంటి పార్టీపై ముఖ్యమంత్రి అవగాహనలేని వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు.
సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అలాగే బీజేపీ మూలమైన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను బీజేపీ కొనసాగిస్తోందని తెలిపారు. విదేశీ మహిళ అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీపై అర్థంలేని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ఖమ్మంలో జరిగిన సీపీఐ సభలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతుందని, సీపీఐ నేతలు వందేళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్నామని, మరో వందేళ్లు కూడా పోరాటం చేస్తామని చెప్పడంలోనే కమ్యూనిస్టు నాయకులకు పేదరిక నిర్మూలనపై ఆసక్తి లేదని స్పష్టమవుతోందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు అభివృద్ధి నిరోధక పార్టీ అనే పేరు ఉందని వ్యాఖ్యానించారు.
దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న పార్టీ బీజేపీ అని, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా మొదటగా వ్యతిరేకించేది కమ్యూనిస్టు పార్టీలేనని గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. అందుకే కమ్యూనిస్టులను ఖమ్మం జిల్లా ప్రజలు, దేశ ప్రజలు మరిచిపోయారని అన్నారు.
బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించే కాంగ్రెస్ పార్టీనే గతంలో “కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్” అన్న వ్యక్తులు ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం తగదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దె దించటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



