ముస్తాబాద్ /పున్నమి/ ప్రతినిధి ఫిబ్రవరి
ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేపడుతున్న విచారణలను అనవసర ఆరోపణలతో అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు. ఫోన్ టాపింగ్, వ్యాపారులపై ఒత్తిళ్లు వంటి ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయని గుర్తుచేశారు. ఇలాంటి గత చర్యలను మరిచి ప్రస్తుత ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం సమంజసం కాదని తెలిపారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు మానుకొని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా నాయకులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.


