సి ఐ ఐ సమ్మిట్ కు జీవీఎంసీ ఏర్పాట్లు సర్వం సిద్ధం.
*దేశ ,విదేశాల అతిథులను ఆకర్షించేలా నగర అభివృద్ధి, సుందరీకరణ.
*దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమానికి శ్రీకారం.
-జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ వేదికగా నవంబరు 14 ,15 తేదీల్లో జరుగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు కు జీవీఎంసీ చేపట్టిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేయడమైనదని, పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబడుతుందని, దేశ, విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు విచ్చేయుచున్నందున వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి పరుస్తూ, సుందరీకరణ పనులతో తీర్చిదిద్దడం జరిగినదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ దిశగా ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుచున్న ఈ సదస్సును “జీరో వేస్ట్ మోడల్ ” కార్యక్రమంగా శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమంగా చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యర్థాలను 100 శాతం రీసైకిల్ చేసి పునర్వినియోగం చేయనున్నామని, అలాగే ప్రాంగణం సమీపంలో ఆన్ సైట్ కంపోస్ట్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఈ కార్యక్రమం దేశంలో మొట్టమొదటి కార్యక్రమంగా విశాఖ నగరంలో జరుగుచున్నదని, ఇకపై విశాఖ నగరంలో జరుగబోయే అన్ని కార్యక్రమాలు జీరో వేస్ట్ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
విశాఖ నగర అభివృద్ధి ,సుందరీకరణ పనులను జీవీఎంసీ చేపట్టి పూర్తిచేసిన పనులను కేవలం సిఐఐ భాగస్వామ్య సదస్సు కొరకు మాత్రమే కాకుండా త్వరలో విశాఖలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, నేవీ డే, తదితర కార్యక్రమాల కొరకు విశాఖ నగరం సుందరీకరణతో సిద్ధంగా ఉండేలా దీర్ఘకాలిక కార్యచరణ చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు.
ముఖ్యంగా విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు, విహారయాత్రికలు, అతిధులు బీచ్ ను సందర్శిస్తున్నందున బీచ్ రోడ్లను, ఫుట్ పాత్ లను,అందమైన మొక్కలతో పచ్చదనంతో సెంటర్ మీడియన్ లను, విద్యుత్తు కాంతులను , రాత్రిపూట కూడా ఎక్కువ కాంతినిచ్చేలా ఆర్కే బీచ్ లో నాలుగు అతిపెద్ద బీచ్ సాండ్ పోల్స్ లను ఏర్పాటుచేసి రంగు రంగుల విద్యుత్ దీపాలతో బీచ్ ని సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు. అలాగే భాగస్వామ్య సదస్సుకు విచ్చేయనున్న అతిథులను ఆకర్షించుకునేందుకు గాను జీవీఎంసీ యంత్రాంగం మూడు నెలల కాలం నుండి నగరంలో 26 స్ట్రెచెస్ లో ఐదు కేటగిరీలలో రోడ్లు , ఫుట్పాతులు, సెంటర్ మీడియన్ లు, పలు జంక్షన్ లు, బస్ బే లు, వినూత్న ఆకృతి గల బొమ్మలు, పచ్చదనంతో కూడిన ఆకర్షణీయమైన మొక్కలు, విద్యుత్ దీపాలంకరణ, వాల్ పెయింటింగులు, మ్యూరల్ ఆర్ట్స్, తదితర అభివృద్ధి, సుందరీకరణ పనులను పూర్తి చేసామన్నారు.
సదస్సు ప్రాంగణం ,పరిసరాలలో , పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్ల సదుపాయాన్ని ఏర్పాటు చేయడమైనదని, అలాగే వ్యర్థాలను వెలికి తీసి నిత్య పరిశుభ్రత కొరకు పారిశుద్ధ్య కార్మికులను 15వ తేదీ వరకు మూడు షిఫ్ట్ ల లో 24 గంటలు విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు జీవీఎంసీ అధికారులు ,జోనల్ కమిషనర్లు, అన్ని విభాగాలు మూడు నెలల నుండి నిరంతరం శ్రమించి నగర అభివృద్ధి ,సుందరీ కరణ పనులను తీర్చిదిద్దారన్నారు.


