నెల్లూరు, డిసెంబర్ 5 (పున్నమి ప్రతినిధి):
వైద్య–ఆరోగ్యశాఖలో 37 ఏళ్లపాటు ప్రజలకు సమర్పణతో సేవలందించిన రామతీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ నర్స్ శ్రీమతి కొండా ఝాన్సీ రాణి గారి రిటైర్మెంట్ మహోత్సవాన్ని ఏపీ ఎన్జీ జివో హోమ్, ఎం.జి.బి మాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, గౌరవాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. ఇందిర పాల్గొని ఝాన్సీ రాణిని సన్మానించారు.
మైపాడు, రామతీర్థం వంటి సముద్ర పరివాహక ప్రాంతాలలో ఎక్కువకాలం పనిచేసిన ఆమె వేలాది మంది మహిళలకు సురక్షిత ప్రసవాలు, చిన్నారులకు టీకాలు అందించడంలో కీలక పాత్ర పోషించినట్టు వక్తలు కొనియాడారు. సేవా మూర్తిగా, పేదల ఆరోగ్య దేవతగా ప్రజల్లో విశేష గౌరవం సంపాదించిన ఝాన్సీ రాణి తోటి ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తూ మంచి నాయకత్వం చూపినట్టు తెలిపారు.
ఆమె భర్త, స్వర్గీయ బాలసుబ్రమణ్యం కూడా హెల్త్ సూపర్వైజర్‌గా సేవలందించి పేదల డాక్టర్‌గా పేరు గాంచిన విషయాన్ని స్మరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారి కుమార్తె జయశ్రీ దుర్గ, అల్లుడు శివకుమార్ ప్రత్యేకంగా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆమె సేవల వీడియో ప్రదర్శనను చూపించారు.
ఈ సందర్భంగా ఏపీ మెడికల్ & హెల్త్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపకులు ఏ.హరిబాబు, డాక్టర్ సులోచనమ్మ, సాయిరాం హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.లలితా షిర్డీషా, అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్పం శ్రీనివాసులు, జనవిజ్ఞాన వేదిక స్టేట్ ప్రెసిడెంట్ నమ్మి స్వరాజ్యలక్ష్మి, కొండా కనకరాజు, పి.ఎల్.రావు, రిటైర్డ్ నాయకులు ప్రపుల్ల, భవాని, వసంత, అరుణా రాణి, ఏపీ హంస సిటీ సెక్రెటరీ మంజరి, రూరల్ తాలూకా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతమ్మ తదితరులు ప్రసంగిస్తూ ఝాన్సీ రాణి సేవలను శ్లాఘించారు.


