*సమాచార శాఖ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర*
*మొక్కలు నాటిన డీడీ కె. సదారావు, ఇతర ఉద్యోగులు
విశాఖపట్టణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఉదయం స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ నెల మూడో శనివారం థీమ్ క్లీన్ ఎయిర్ కు అనుగుణంగా మొక్కలు నాటారు. వాటికి నీరు పోసి రక్షణ కంచెలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న మొక్కలకు హీడింగ్ చేశారు. వాటి వద్ద నీరు నిలిచేలా చుట్టూ గోతులు తవ్వారు. అనంతరం పలువురు వాహనదారులకు క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్పై అవగాహన కల్పించారు. కాలం చెల్లిన వాహనాలను వినియోగించరాదని, వాయు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తదుపరి సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ కె. సదారావు, ఇతర అధికారులు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రతకు, పచ్చదనం పెంపొందించుటకు, స్వచ్ఛాంధ్ర సాధనకు నిబద్ధతతో కృషి చేస్తామని ప్రతినబూనారు. కార్యక్రమంలో డివిజనల్ పీఆర్వో నారాయణరావు, ఏపీఆర్వో శ్రీనివాసరావు, ఏఐఈ రామకృష్ణ, కిశోర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


