పున్నమి ప్రతినిధి 28 మార్చి 2026 రామచంద్రపురం
శ్రీ శక్తి పీఠం, రాయలచెరువు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవంగా భక్తులు కొలిచే జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, మంత్ర మహేశ్వరి, శ్రీ శక్తి పీఠాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ మహాస్వామిని వారి ప్రత్యక్ష సన్నిధిలో రాయలచెరువు శ్రీ శక్తి పీఠంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడినవి.
ఈ శుభసందర్భంగా పీఠ ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. వివాహిత దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగంలో ఆహుతులు సమర్పించారు. యాగానంతరం హోమాగ్నిలో తయారుచేయబడిన పాయసాన్నం పవిత్ర ప్రసాదంగా దంపతులందరికీ అందజేయబడింది.
ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి అనంతలక్ష్మి గారి నేతృత్వంలో బృందం సమర్పించిన “రమణీ రామాయణం” రూపక ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తిరస భరితమైన ఈ ప్రదర్శన భక్తులందరి మనస్సులను రంజింపజేసింది. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది.
అనంతరం శ్రీ తారా దేవి జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేక హోమములు వేదమంత్రోచ్చారణల మధ్య జరుపబడినవి. ఈ కార్యక్రమాలలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి, మాతాజీ వారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమ సమాప్తి అనంతరం పీఠ నిర్వాహకులు వచ్చిన సమస్త భక్తులకు వివిధ రకాల అన్నప్రసాదాలు అందించారు.




