విలువలు లేని విద్య వ్యర్థం**
జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
పున్నమి ప్రతినిధి,తిరుపతి,
విలువలు లేని విద్య వ్యర్థం అని సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సు లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు రేపటి సమాజ నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు నైతిక విలువలను పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఒక చక్కటి ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మానవతా విలువలు తగ్గిపోతున్నాయని ముఖ్యంగా చిన్నపిల్లల స్థాయి నుండే వీటిని అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు వీటిని నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ పాఠశాలలో విద్యార్థుల మధ్య పోటీ తత్వం పెరిగిపోవడంతో మానవతా విలువలను పక్కన పెడుతున్నారన్నారు. ఎక్కువ ప్రాధాన్యత పోటీ తత్వానికే ఇస్తూ విలువలను విస్మరిస్తున్నారన్నారు. ఈ అంశంలో ఉపాధ్యాయులు కూడా వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావడం వల్ల సమాజంలో ఎన్నో అరిష్టాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈమధ్య సోషల్ మీడియా వైపు పిల్లలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రద్ధ పెట్టి విద్యా వ్యవస్థలో మానవతా విలువలను మరళా తీసుకురావాలని పాఠ్యాంశంలో వీటిని ఎలా భాగం చేయాలి అనే దానిపై ఆలోచన చేసి మంచి కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగా సోమవారం మనకు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావుని అడ్వైజర్ గా నియమించి విద్యా విలువలను పెంపొందించడానికి అర్థమయ్యే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. పిల్లలు మంచి విలువలను అలవర్చుకొని సమాజాన్ని విలువలతో తీర్చిదిద్దుతారని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నానన్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ రోజున తిరుపతిలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి ఎంతో అవసరమని భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగకరమని అన్నారు. పిల్లల్లో సమయపాలన, ఆత్మస్థైర్యం సరిగా ఉండడం లేదని, వాటన్నింటినీ అధిగమించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ యం వి కృష్ణారెడ్డి, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీమతి ఆర్.ఉష, తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె వి ఎన్ కుమార్, తిరుపతి అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష జి.గౌరీ శంకర్ రావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మికాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.






