



శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం స్థానిక దేవాది గ్రామంలో 78 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పవిత్రక్షేత్రంలో ప్రతీ శరదృతువులో ఉత్సవ రంజితంగా విరాజిల్లే శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది మరింత వైభవంగా జరుగుతున్నాయి. ఆదిమహాశక్తికి ప్రతీ ఉదయం ప్రాతఃస్మరణ సేవలతో ప్రారంభమై, సంధ్యాకాలంలో దీపాంతరాల కాంతుల మధ్య శ్రీలలితా సహస్రనామ కుంకుమార్చనల ఘోష ఆలయం అంతటా మార్మోగుతోంది.మహాదేవికి ప్రతిరోజూ అవతారాల అలంకరణలతో అమ్మవారి మహిమను స్తుతిస్తూ, వినోదారాధన అనే భావంతో నిన్న దేవాది గ్రామంలోని యువతులు సాంప్రదాయపూర్వకంగా, ఆనందోత్సాహాలతో కొలాటం ఆడి దేవిని ప్రసన్నం చేసుకున్నారు.
శరన్నవరాత్రులలో ఆరవ అవతారంగా శ్రీలలితా త్రిపురసుందరి దీపాలంకరణతో విరాజిల్లగా, నేడు మహాసరస్వతి అవతారాన్ని పురస్కరించుకొని పిల్లలందరికీ సరస్వతి పూజలు నిర్వహించబడినట్లు ఆలయ అర్చకులు శ్రీ నమశ్శివాయ గారు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30వ తేదీ అనగా రేపటి నాడు అమ్మవారికి ప్రత్యేకంగా కుమారి పూజ నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందగలరని ఆయన పిలుపునిచ్చారు.

