శ్రీకాళహస్తి, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక సాంస్కృతిక కళావేదిక (ధూర్జటి ప్రాంగణం) నందు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు శివతత్వాన్ని, శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ చాగంటి వారు సాగించిన ప్రవచనం ఆద్యంతం భక్తిభావంతో సాగింది. మానవ జన్మ సార్థకతకు భక్తి మార్గమే శరణ్యమని, పరమశివుని అనుగ్రహం పొందేందుకు నిరంతర నామస్మరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని మహత్తును, జ్ఞానప్రసూనాంబికా దేవి కరుణాకటాక్షాలను పురాణగాథలతో జోడించి ఆయన వివరించిన తీరు భక్తుల హృదయాలను హత్తుకుంది. చాగంటి ప్రవచనాన్ని ఆలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కళావేదిక ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం చాగంటి వారిని స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ఆలయ పరిపాలన అధికారి బాపిరెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా సత్కరించి శ్రీ స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు నేటితో (ఫిబ్రవరి 23) శాంతి అభిషేకంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే నంది సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం వంటి ప్రధాన ఘట్టాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను రద్దు చేసి, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

శ్రీకాళహస్తిలో చాగంటి ప్రవచనామృతం-శివతత్వంతో పులకించిన భక్తజనం