

కులమతాలు, మాతృ భాషలు వేరైనా మనమంతా ఒక్కటేనని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్స్ డా.పైడి.సింధూర అన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు, స్థానిక భాష్యం పాఠశాలలో పీస్ పోస్టర్ పోటీలను, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగముగా డా.పైడి.సింధూర మాట్లాడుతూ శాంతి అనే ఆయుధంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని, కోపం వద్దు, శాంతే ముద్దని అన్నారు. కోపం అనర్థాలకు దారితీస్తుందని, శాంతం నిజా నిజాలను తెలుసుకునే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తుందని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి శాంతం తోడ్పడుతుందన్నారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న పీస్ పోస్టర్ కంటెస్ట్ జిల్లా చైర్మన్ ఎం.ఎస్ఎన్.మూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ విషయంలోనూ తొందరపడొద్దని, శాంతియుతమైన జీవన విధానాన్ని అనుసరించడమే అన్ని విధాలా మంచిదని, ఎవరైతే కోపతాపాలను ప్రదర్శిస్తారో వాళ్లకి అందరూ దూరమైపోతుంటారన్నారు.
శాంతంగా వుంటే అందరూ బంధువులుగా మారిపోతారని, ఎవరైతే శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకుంటారో, అలాంటివారి జీవితం ప్రశాంతంగా సాగిపోతూ వుంటుందని, శాంతం ఎక్కడ వుంటుందో అక్కడ సంతోషం, సంతృప్తి వుంటాయన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు లయన్స్ ఇంటర్నేషనల్ బహుమతులను అందించి, పాల్గొన్న ప్రతీ విద్యార్థికీ ప్రశంసాపత్రాలను, భాష్యం పాఠాశాల ప్రిన్సిపాల్ సురేష్, రవీంద్రభారతి పాఠశాల డిఐ రమేష్, నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ లతో కలసి అందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, మెంటార్, జిల్లా చైర్మన్ నటుకుల.మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవికుమార్, ఉపాధ్యక్షులు బోగెల ఉమా మహేశ్వర రావు, సీనియర్ సభ్యులు నారా.ఈశ్వర రావు, అంధవరపు.ప్రసాద్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

