*_వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._*
*_కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._*
*_వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._*
*_తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్* *డిమాండ్*
కగజ్ నగర్: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు.
రెక్కల కష్టం చేసి సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికుల జీవనం దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కార్మికులకుతినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట కరువైందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12000 ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయటం సిగ్గుచేటు అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. వ్యవసాయ కార్మికులు సంపాదించే సంపాదనలో 90 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు 7500 పింఛన్ మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వచ్చిన వ్యవసాయతర కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున వారికి ఉపాధి కల్పించాలన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సిబ్బంది వేతనాలు పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి అన్నారు. అసైన్మెంట్ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. పేదల ఆధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టా హక్కులుకల్పించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.
ముంజం ఆనంద్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్


