వార్డు సభ్యులకు ఘన సన్మానం
పున్నమి ప్రతినిధి రామచంద్రపురం
రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు గ్రామపంచాయతీ సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాయలచెరువు పేటలో వార్డు సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
రాయలచెరువు పేట సర్పంచ్ మాదాసు మురగయ్య, శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన వార్డు సభ్యులను బుధవారం ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులకు పసుపు, కుంకుమ, చీరలు, స్టీల్ తట్టులు బహూకరించడంతో పాటు సాలువాలతో సన్మానించారు. పంచాయతీ అభివృద్ధి, ప్రజాసేవలో భాగస్వాములైన సభ్యులకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాదాసు మురగయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. “మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో మరింత బలపడుతుంది” అని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ ప్రజలకు అందించిన సేవలు, సహకారం గుర్తుంచుకుంటూ వార్డు సభ్యులను సత్కరించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాయలచెరువు పేట పంచాయతీ కన్వీనర్ మధు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


