ఖమ్మం మార్చి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం నుండి బాధితులను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుపేదలు కట్టుకున్న గూడును కూల్చివేసి వారిని రోడ్డున పడేసిన ప్రభుత్వం ఇప్పుడు పునరావాస కేంద్రం నుంచి కూడా వారిని తరిమేయాలని చూస్తోందని మండిపడ్డారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పునరావాస కేంద్రం నుండి బయటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కే.టి. రామారావు ఆదేశాల మేరకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హెల్త్ చెకప్ క్యాంప్ ద్వారా బాధితులకు అవసరమైన మందులను అందజేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బాధితులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాటం కొనసాగుతుందని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బాధితుల తరఫున న్యాయస్థానంలో పోరాడేందుకు ప్రత్యేక లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వెలుగుమట్ల భూదాన్ బాధితులకు వారు కోల్పోయిన ప్రదేశంలోనే 100 గజాల స్థలం, ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడానికి ముందు అనేక హామీలు ఇచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
ప్రభుత్వం బాధితులను విడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బలి కావద్దని బాధితులను కోరుతూ, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఆర్‌జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


