ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
ఖమ్మం కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు వెయ్యి పేద కుటుంబాల గుడిసెలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ పేర్కొన్నారు. పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడం అమానుష చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు అమాయక ప్రజల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక పేదలకు న్యాయం చేయాల్సిందిపోయి, వేలాది మంది పోలీసులతో దాడి చేసి గుడిసెలను కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని విమర్శించారు. కనీసం కుటుంబాలకు తమ సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ మాట్లాడుతూ, పదేళ్లుగా అక్కడే నివసిస్తూ ప్రభుత్వాన్ని పట్టాల కోసం వేడుకుంటున్న పేదలపై ఈ విధంగా ప్రతాపం చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ముగ్గురు మంత్రుల ఆదేశాలతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు.
ఈ భూములపై ఎప్పటినుంచో కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు పథకం ప్రకారం పావులు కదిపారని, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ లు కూడా ఈ వ్యవహారంలో పాత్ర పోషించారని బీజేపీ నేతలు విమర్శించారు. తెల్లవారుజామునే భారీ పోలీస్ బలగాలను మోహరించి పేదల ఇళ్లను ఖాళీ చేయించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదలను రోడ్డున పడేసే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున అండగా నిలుస్తుందని, న్యాయపరంగా మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ హెచ్చరించారు.


