వెలంపేట మురికివాడను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్
*50 ఏళ్లు పైబడి నివసిస్తున్నాం ఇండ్లు నిర్మించి, మౌలిక వసతులు కల్పించండని కమిషనర్ను కోరిన నివాసితులు.
*పి పి పి మోడల్ లో బహుళ అంతస్తులు నిర్మించి అందిస్తాం.
– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
*విశాఖపట్నం డిసెంబర్ 11పున్నమి ప్రతినిధి* వెలంపేట మురికివాడలోని ప్రజలకు శాశ్వత నివాసం తో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. గురువారం ఆయన 4వ జోన్ 35వ వార్డు వెలంపేట మురికివాడను జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు పివివి సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెలంపేటలోని మురికివాడలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడుతూ ఎప్పటినుండి నివాసం ఉంటున్నారని, ఏ ఏ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఏఏ పనులు చేస్తున్నారని ఆరా తీశారు. అలాగే వారి నివాసం ఉంటున్న ఇంటి లోపల కమిషనర్ పరిశీలించి, వారి ఆధార కార్డు, చిరునామా, డోర్ నెంబర్ మొదలైనవి పరిశీలించారు. మడగల వెంకయ్యమ్మ అనే వృద్ధురాలను ఎప్పటినుండి మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారని కమిషనర్ ఆరా తీయగా, వెలంపేటలో దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ జీవనం సాగిస్తున్నామని, ఈ మురికి వాటర్ లో నివసిస్తున్న వారందరూ ఇక్కడే పుట్టి పెరిగారని తెలిపారు. వెలంపేటలో ఎటువంటి మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, కాలువలు మొదలైనవి సరిగా లేవని, అలాగే మాకు ఇదే ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కమిషనర్ కు నివాసితులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ వెలంపేట మురికివాడలో దాదాపు 170 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అందరికీ ఇల్లు నిర్మించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని, అందుకు పిపిపి మోడల్ లో బహుళ అంతస్తులు నిర్మించి అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, అందుకు కొంత సొమ్ము నివాసితులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున వారికి బ్యాంకు లోను సదుపాయం ఏర్పాటు చేస్తామని, అందుకు నివాసితులు ముందుకు వస్తే కొంత సొమ్ము బ్యాంకు లోన్ ద్వారా నెలనెలా కట్టవలసి ఉంటుందని తెలపగా నివాసితులు అందుకు అంగీకారం తెలిపారని కమిషనర్ తెలియజేశారు.
నివాసితుల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి వారికి బ్యాంక్ లోను ఏర్పాటుకు బ్యాంకర్లతో మాట్లాడి సమాచారం సిద్ధం చేయాలని యు సి డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం సత్యవేణికి కమిషనర్ ఆదేశించారు. ఈ మురికివాడలో బహులంతస్తులో నివాసాల నిర్మాణం చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేయాలని, సంబంధిత ప్రణాళికలను సమర్పించాలని ప్రధాన ఇంజనీరు పీవీ సత్యనారాయణ రాజుకు, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావుకు కమిషనర్ ఆదేశించారు. నివాసితులలో కొంతమంది వృద్ధులకు ప్రభుత్వ పింఛన్లు అందలేదని కమిషనర్ కు తెలపగా ఆయా వివరాలు సేకరించి పింఛన్ల మంజూరుకు కార్యాచరణ చేపట్టాలని జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడును కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో డీసీపీ హరిదాస్, ఏసీబీ ఝాన్సీ లక్ష్మి ఏపిడి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


