


వీధి వ్యాపారుల జీవనోపాధిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. జీవీఎంసీ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తోపుడు బండ్లు, బడ్డీలు, చిరు వ్యాపార దుకాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా, వైయస్సార్సీపీ శ్రేణులు వాటిని అధిగమించి జీవీఎంసీ వద్ద ఆందోళన కొనసాగించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ,
జీవీఎంసీ అధికారులు గతంలో హాకర్ జోన్లు ఏర్పాటు చేసి ట్రేడ్ లైసెన్సులు, విద్యుత్ మీటర్లు కేటాయించినా, ఇప్పుడు రాజకీయ కక్షలతో షాపులు కూల్చివేస్తున్నారని
మహిళల స్వయం ఉపాధిని దారుణంగా దెబ్బతీస్తున్నారని
మేయర్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు వీధి వ్యాపారులకు క్షమాపణలు చెప్పాలని
బాధితులందరికీ తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయం కారణంగా దాదాపు 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కె.కె.రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు ముద్ర లోన్స్, వైయస్సార్ చేయూత వంటి పథకాల ద్వారా అప్పులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీ ధ్వంసమవ్వడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుకాణాల్లోని ఫ్రిజ్‌లు, గ్రైండర్లు, మిక్సీలు వంటి సామగ్రి కూడా ధ్వంసమైందన్నారు
అంతేకాకుండా
అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికే విశాఖ అభివృద్ధిని పణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో ఇక్కడి భూములను కాజేసి, అమరావతికి తరలించే కుట్ర కూటమి ప్రభుత్వమిదేనని విమర్శించారు. పేదలు స్వయం ఉపాధితో నిలబడటం కూటమి నాయకులు భరించలేరని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళలు, చిరు వ్యాపారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

