వీధి కుక్కలకు ఆపరేషన్ల కోసం అదనపు సౌకర్యాలు పెంచాం
– కూటమి వచ్చిన 14నెలల్లోనే 10,293 ఆపరేషన్లు అయ్యాయి
– వైసిపి నాలుగేళ్లలో 12,100 ఆపరేషన్లే చేసారు
– వైసిపి హయాంలో కెపాసిటీ ఎందుకు పెంచలేదు
– ప్రజల ఆరోగ్యం, సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు
– వీధి కుక్కలు గురించి కామెంట్లు తప్ప పరిష్కారం ఎందుకు చూపలేదు
– కూటమి అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో
– స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో వ్యాక్సినేషన్
– వచ్చే ఏడాదిలోగా కెపాసిటీ మరింత పెంచి వ్యాక్సినేషన్, ఆపరేషన్లు పూర్తిచేస్తాం
– ఊరిపట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లే మూగజీవాల పట్ల నాకు బాధ్యత ఉంది
– ఏబీసీ సెంటర్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడి
కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్కతేల్చి , వాటికి ఆపరేషన్లు చేయడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్ర వరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రాజమహేంద్ర వరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ లో వసతులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు. ఏబీసీ సెంటర్ లో సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం వలన కుక్కలు బయటకు వెళ్ళిపోవడం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వాసు అన్నారు. పనిచేసే అధికారులున్నా సరే, సరిగ్గా వినియోగించు కోలేదని ఆయన వాపోయారు.
ఏబీసీ సెంటర్ లో వైసిపి హయాం నాలుగేళ్లలో 12,100 ఆపరేషన్లు జరిగితే, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాంతాలవారీగా అధికారులకు బాధ్యతలు ఇచ్చి లెక్కలు తేల్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. సిటీలోని 50వార్డుల్లో మొత్తం 29వేల 91కుక్కలు ఉన్నాయని తేల్చి, సౌకర్యాలు పెంచి, వేగంగా ఆపరేషన్లు చేసినట్లు ఆయన వివరించారు. ఫలితంగా ఈ 14నెలల్లో మొత్తం 10,293 ఆపరేషన్లు అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో నెలకు సగటున 300ఆపరేషన్లు అయితే ఇప్పుడు నెలకు 850అవుతున్నాయని ఆయన తెలిపారు. ఇంకా 18,860కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని తెలిపారు. మరి వైసిపి హయాంలో ఎందుకు శ్రద్ధ వహించలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఊహించుకుంటే అర్ధం అవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు.
ఇప్పుడు వైసిపి వాళ్ళు అవిగో కుక్కలు, అదిగో పిల్లల మీదికి పోతున్నాయి, అదిగో రోడ్లమీదికి వెళ్లిపోతున్నాయి అని చెబుతున్నారే గానీ పరిష్కారం చూపించగలిగారా అని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. ఈజీవుల అంశం కేంద్ర పరిధిలో ఉన్న అంశమని, వీటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం మన చేతుల్లో ఉన్నపని అని గుర్తించి అధికారంలోకి వచ్చినవెంటనే చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. అధికారుల సహకారంలో కెన్నెల్స్ పెంచి, ఆపరేషనలు పెంచామని ఆయన తెలిపారు. స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ వేస్తున్నారని ఎమ్మెల్యే వాసు చెప్పారు. కొవ్వూరు , నిడదవోలు ప్రాంతాల్లో కూడా కుక్కలను ఇక్కడికి తీసుకొస్తున్నారని, ప్రతీ కెన్నెల్ కి ఎక్కడి నుంచి తెచ్చారో బోర్డు కూడా పెట్టారని ఆయన చూపించారు.
ప్రస్తుతం రోజుకి 30,40అవుతున్నాయని, వచ్చే ఏడాదిలో కెపాసిటీ 50కి పెంచి , నగరంలో ఉన్న కుక్కలన్నింటికీ వ్యాక్సినేషన్, ఆపరేషన్లు పూర్తిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అవగాహనతో కమిట్మెంట్ తో చేస్తామన్నారు. ఊరు పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లే మూగజీవాల పట్ల కూడా తనకు బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేసారు. రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేమని చెప్పానని, రెండేళ్లలో కంట్రోల్ చేస్తామని అన్నానని, 14నెలల స్టాటిస్టిక్స్ చూస్తే ఎంతమేరకు చిత్తశుద్ధితో పనిచేశామో తెలుస్తుందని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏబీసీ సెంటర్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.


