*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖ శ్రీ శారదా పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివార్ల ఆశీస్సులతో శ్రీ శారదా పీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు భక్తి, వైభవాలతో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతి సంవత్సరం అత్యంత శ్రద్ధతో నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఈసారి కూడా భక్తులు అశేషంగా తరలి వచ్చి పాల్గొన్నారు.
ఉదయం కార్యక్రమాల్లో భాగంగా శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి పాలకావిడి ఊరేగింపు పీఠ ప్రాంగణంలోని మేధా దక్షిణామూర్తి ఆలయం నుండి ప్రారంభమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వైభవంగా సాగింది. భక్తులు స్వామివారికి అర్పించిన పాలకావిడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై “సరవణ భవ” నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.
తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకం వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. పంచామృతంతో స్వామివారికి చేసిన అభిషేకం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
సాయంకాలం శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. మంగళవాయిద్యాలు, వేదపండితుల ఆశీర్వచనాలు, భక్తుల హారతులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. స్వామివారి కల్యాణం దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
ఈ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్యానుగ్రహం పొందారు


