విశాఖ డీఆర్వో, ఆర్డీవో రచ్చతో ప్రకంపనలు!
`రాష్ట్ర వ్యాప్తంగా చర్చ
`ఇరువుర్ని బదిలీ చేసిన ప్రభుత్వం
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
రెవెన్యూ శాఖను ఒక కుదుపు కుదిపేసిన విశాఖ ‘పప్పు, ఉప్పు’ రచ్చపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. విశాఖ డీఆర్వోపై ఫర్యాదు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో లేఖ రాయడంపై రెవెన్యూ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ అనగానే ప్రోటోకాల్ మర్యాదలు చూసే కీలకమైన శాఖగా పేరుంది. ఆ శాఖ పరిధిలోని భూములు, ఇతరత్రా వ్యవహారాల సంగతి పక్కన పెడితే.. ఈ ప్రోటోకాల్ పేరుతో జరిగే ఆ శాఖ పరిధిలోని కిందిస్థాయి కార్యాలయాల నుంచి జరిపే అనధికార వసూళ్లు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. దీనికి విశాఖ రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న తాజా పరిణామాలే నిదర్శనం. శ్రీకాకుళం నగరంలో ఉంటున్న తన కుటుంబానికి ఇక్కడి రెవెన్యూ అధికారుల ద్వారా కిరాణా సరుకులు సరఫరా చేయించుకుంటున్న డీఆర్వో భవానీశంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీలేఖ ఆ లేఖ కోరారు. ఇది కాస్త రచ్చ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వో, ఆర్డీవోలపై వేటు వేసింది. వారిని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి సరెండర్ చేస్తూ వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినా రెవెన్యూతో సహా అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రోటోకాల్ వివాదాలు, అవినీతి ఆరోపణలకు పరోక్షంగా ప్రభుత్వం కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడున్న ఆర్డీవో శ్రీలేఖ వివాదస్పదమైన వాదన ఇప్పటిది కాదు.. ఆమె విధుల్లో చేరిన నాటి నుంచి కూడా ఏదో వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. సరుకులు సప్లై కోణంలో డీఆర్వో భవానీ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇరువురికి దాదాపు ఏడాదిగా వివాదం వుందనే వాదన లేకపోలేదు. ఇరువురు ఈగోకి వెళ్లే దాఖలాలు కూడా వున్నాయనే వాదన విశాఖ కలెక్టరేట్‌లో వినిపిస్తున్నాయి. ఎవరైతే నాకేంటి? అనే పంథాలో ఆర్డీవో శ్రీలేఖ వ్యవహరించేదనే వాదన బలంగా కలెక్టరేట్ నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో.. ఆ ప్రభుత్వ మాటేమో కానీ.. చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించిన బదిలీ అయిన శ్రీలేఖ.. అక్కడున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అక్కడున్న పరిస్థితుల్లో భాగంగా ఆయనకు మచ్చెమటలు పట్టించిన నేపధ్యంలో.. ప్రస్తుతం ప్రభుత్వం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టిలో పడడంతో రాష్ట్రంలో కీలకమైన జిల్లాగా పేరొందిన విశాఖలో ఆర్డీవో పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. విశాఖకు వచ్చాక.. పలు వివాదాల్లో శ్రీలేఖ కూరుకుపోయిందనే వాదన వుంది. పత్రికల పరంగా కూడా ఆమె వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందనే ఆరోపణలున్నాయి. ఓ పత్రికపై తనదైన శైలిలో విజృంభించందనే వాదన వుంది. మరోపక్క.. గాజువాక అంశం పక్కన పెడితే… తనకు అడ్డుగా వున్నాడనే యోచనతో డీఆర్వో భవానీ ప్రసాద్ అంశంపై మీడియాకు లీక్‌లు ఇస్తూ.. అది కూడా ప్రతిపక్షానికి చెందిన మీడియాకు లీకులివ్వడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం నేపధ్యంలొ ఇరువురు మధ్య నెలకొన్న వైరం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నది అనే యోచనలో… ఇరువుర్ని కూడా ఇక్కడ నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

