విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నం జిల్లా పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి పాత గాజువాక జంక్షన్‌లోని 38 బస్ స్టాప్ సమీపంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖకు 40 కేజీల గంజాయిని తీసుకువచ్చి దించుతుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడ దాడి చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను తదుపరి విచారణ నిమిత్తం గాజువాక పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠాపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.



