అఖిల భారత సిఐటియు 18వ మహాసభను పురస్కరించుకొని నిర్వహించబోయే శ్రామిక సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సమావేశాన్ని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు జి.రమణ అధ్యక్షతన నిర్వహించారు.
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి.నర్సింగరావు, మాజీ మేయర్ దాడి సత్యనారాయణ, సినీ దర్శకుడు యాద్ కుమార్, వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరవ ప్రకాశరావు, వంగపండు దుష్యంతు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు నాగభూషణం, లీడర్ పత్రిక రమణమూర్తి, కేరళ కళా సమితి ఉపాధ్యక్షుడు పీకే జోస్ తదితరులు డంకా మ్రోగించి ఉత్సవాల సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ — నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్మిక హక్కులను హరించే విధంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తూ, సహజ వనరులను పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. విశాఖలో జరుగనున్న మహాసభలు శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని సూచించారు.
దాడి సత్యనారాయణ మాట్లాడుతూ — ఇంతటి మహా కార్యక్రమం విశాఖలో జరగడం నగర గౌరవాన్ని పెంచుతుందని, సిఐటియు పోరాటాలు కార్మిక హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
ఐఎన్టీయూసీ నాయకుడు నాగభూషణం మాట్లాడుతూ — సిఐటియు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు జరిపిందని, తాను కూడా కళారంగం ద్వారా సహకరిస్తానని తెలిపారు.
సినీ దర్శకుడు యాద్ కుమార్ మాట్లాడుతూ — సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.
నరవ ప్రకాశరావు మాట్లాడుతూ — విశాఖ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించాలని సూచించారు.
వంగపండు దుష్యంతు మాట్లాడుతూ — కార్మిక సమస్యలపై ఎర్రజెండా నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రజా కళారూపాల ద్వారా ప్రతిబింబించాలని కోరారు.
ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు మంగరాజు మాట్లాడుతూ — ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల పై జరుగుతున్న దాడులను ప్రతిబింబించే పాటలు, వీధినాటకాలు, నిశ్చరూపకాలు ప్రదర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులను ఆహ్వానిస్తామని తెలిపారు. జనవరి 2న కామ్రేడ్ సఫ్దర్ హస్మి స్మారకంగా వీధి నాటకోత్సవాలు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు.
నాటకరంగ దర్శకుడు చలసాని కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ — సుందరయ్య గారు సైకిల్‌పై తిరిగి పేదల పక్షాన పోరాడిన మహానేత అని, అటువంటి ఆలోచనల వారసత్వం సిఐటియు ద్వారా కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డా.కె.రమాప్రభ, ఎం.చంటి, దండు నాగేశ్వరరావు, గౌరీశంకర్, వై.అప్పారావు, క్రితా కరుణి, లోకేష్, రమణమూర్తి, ఆర్.కె.ఎస్.వి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.


