విజయవాడ: అక్టోబర్ 6 పున్నమి ప్రతినిధి సురేష్
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఈ రోజు తెల్లవారుజామున పానాసోనిక్ ఎలక్ట్రానిక్ వస్తువుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు తీవ్రంగా ఎగిసిపడటంతో గోదాంలో నిల్వ ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో సుమారు ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మొత్తం ఏడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి.
సుమారు గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని గోదాం సిబ్బంది, పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికుల్లో ఆందోళన:
భారీగా ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఉదయం వేళ ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, భారీ ఆస్తి నష్టం సంభవించింది.


